నేనే మీ భవిష్యత్ అంటూ ప్రజల్ని బెదిరిస్తూ తన తరపున మూకను ప్రజల్లోకి పంపేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. మా నమ్మకం నువ్వే అని ప్రజలతో బలవంతంగా అనిపించే ప్రయత్నాలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఏ రాజకీయ నాయకుడి భవిష్యత్ అయినా తేల్చాల్సింది ప్రజలు. అలాంటిది నేనే మీకు భవిష్యత్ అంటూ అహంకారం ప్రదర్శిస్తూ ప్రజల వద్దకు వెళ్లడం అంటే అంతకు మించిన గర్వం మరొకటి ఉండదన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అదే జరుగుతూంటే ప్రజలు కూడా ఇదేం ఖర్మ అనుకుంటున్నారు.
పథకాల పేరుతో ప్రజలకు ఎంతో కొంత డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి.. గొప్ప సాయం చేశామన్నట్లుగా జగన్ బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఆ సొమ్ము కన్నా రెట్టింపు వివిధ పద్దతుల్లో ఆ కుటుంబాల వద్దే నొక్కేసిన వైనంపై అందరికీ అవగాహన ఉంది. ఆ దోపిడీ ఇంకా పెరుగుతూనే ఉంది. మద్యం అలవాటు ఉన్న ఒక్క కుటంబంలో సగం ఆదాయాన్ని ప్రభుత్వమే పిండుకుంటోంది. దానికి మళ్లీ మద్యం తగ్గింపు కోసం అనే కారణాన్ని చెబుతూ వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది.
ఇక వన్ టై సెటిల్మెంట్ అని.. రేషన్ అని.. మరొకటని ప్రజలకు ఏ ప్రయోజనం సరిగ్గా అందకుండా చేస్తున్నారు. ఇటీవల పథకాలకు మీటలు నొక్కినప్పటికీ ఖాతాల్లో జమ కావడం లేదు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పూర్తిగా పక్కన పడిపోయింది. ఏడాది మొత్తం ఫీజులు నాలుగు విడతల్లో ఇస్తామని చెప్పి ఒక్క విడతే మీట నొక్కారు. అవి కూడా రాలేదు. మీట నొక్కి వారం పది రోజులు అవుతున్నా ఆసరా డబ్బులు ఇంకా జమ కాలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా… నేనే మీ భవిష్యత్ అంటూ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. జగన్ పేరుతో ఇంటింటికి వెళ్తున్న వారికి ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో చాలా మంది ప్రజాప్రతినిధులు రెండు రోజులకే సైలెంట్ అయ్యారు.
వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్తే ప్రజల ఆగ్రహం మరింత రెట్టింపవుతోందన్న రిపోర్టుల ువస్తున్నాయి. అసలు సమస్యలు పరిష్కరించకుండా ఓట్ల కోసం మాత్రం పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారని అంటున్నారు. వారిపై కేసులు పెడతామని బెదిరిస్తే అది తమ నెత్తిపై తాము చేయి పెట్టుకున్నట్లే అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.