సకల రోగాలకు మందు జిందాతిలిస్మాత్ లాగా… ఏపీ ప్రభుత్వ ప్రతి చేతకాని తనానికి చంద్రబాబును చూపించడం కామన్ అయిపోయింది. ముఖ్యమంత్రి ఎలాగూ మీడియా ముందుకు వచ్చి చెప్పలేరు. ఆయన తరపున మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం చంద్రబాబుతో ప్రారంభించి.. చంద్రబాబుతో ముగిస్తారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎందుకు వేయడం లేదని నలు వైపుల నుంచి వస్తున్న ప్రశ్నలను తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టారు.
అటు బిడ్ వేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమనలేరు. ఏమైనా అంటే ఏం జరుగుతుందో తెలుసు. అటు ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్నీ ఏమనలేరు. ఏమైనా అనగలిగితే ప్లీజ్ ప్లీజ్ అనే అంటామని గెలిచిన మొదట్లోనే చెప్పారు. ఇక మిగిలిందెవరంటే చంద్రబాబు. ఏదైనా ఆయనను తిట్టేస్తే చాలనుకుంటున్నారు. ఇవాళ కూడా అదే చేశారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ఎందుకు వేయడం లేదంటే… చంద్రబాబు ప్రైవేటీకరణలో మాస్టర్ అని పల్లవి అందుకున్నారు. ఆయన చాలా సంస్థలు ప్రైవేటీకరణ చేశారని.. ఆయన ప్రైవేటీకరణ చేయాలనుకున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని.. ఇలా చంద్రబాబు సీరిస్ వినిపించారు. పోనీ అంతా అయిపోయిన తర్వాతైనా స్టీల్ ప్లాంట్ గురించి చెబుతారా అంటే అదేమీ లేదు.
స్టీల్ ప్లాంట్ ఈవోఏలో ఏముందో తెలియకుడానే అందరూ మాట్లాడుతున్నారని..చెప్పుకొచ్చారు. జగన్ అందరి కంటే ముందే స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానితో మాట్లాడారని కావాలంటే స్టీల్ ప్లాంట్ కు ఉన్న భూములు తాకట్టు పెట్టి అయినాప్లాంట్ ను నడవచ్చని చెప్పారన్నారు. ఇలాంటి సలహాలు మోదీకి జగన్ కాదు.. చాలా మందిఇచ్చి ఉంటారు. అసలు ఎందుకు పోరాడటం లేదు అంటే మాత్రం సజ్జల దగ్గర సౌండ్ ఉండదు. రాను రాను తమ చేతకాని తనాన్ని… ఎవర్నీ ఏమీ అనలేని నిస్సహాయతను చంద్రబాబుపై చూపించి రాజకీయం చేసేస్తున్నారు. అధికారంలో ఉండీ.. ఇంత కంటే నిస్సహాయులు గతంలో ఎవరూ లేరేమో అన్న విమర్శలు ఊరకనే రావుగా మరి !