ఏపీ ప్రభుత్వం మార్గదర్శి టార్గెట్ గా చేస్తున్న వ్యవహారాన్ని డీల్ చేస్తున్నది ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులేనని వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సీతారామాంజనేయులు తన విధుల్ని పక్కనపెట్టి విపక్షాలను .. వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. మార్గదర్శి విషయంలో మొత్తం ఆయనే చేస్తున్నాడని.. ఒకటి, రెండు రోజుల్లో.. ఉండవల్లి అరుణ్ కుమార్ చేత ఢిల్లీలో రామోజీరావుకి వ్యతిరేకంగా మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
రామోజీరావుపై ఏపీ నుంచి వైసీపీ నేతలు చెప్పే మాటల్ని ఢిల్లీలో ఎవరూ వినడంలేదన్నారు కోటంరెడ్డి. అందుకే వారు ఉండవల్లిని వాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు.మార్గదర్శిపై కేసులు పెట్టి రామోజీరావుని, ఆయన కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారని.. కానీ మార్గదర్శి వల్ల తాము నష్టపోయామంటూ ఒక్కరైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు కోటంరెడ్డి. ఒక్కరన్నా మార్గదర్శి కార్యాలయం వద్దకి వెళ్లి తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని అడిగారు. రామోజీరావుని వేధిస్తే ఆయన మీకు లొంగుతాడని అనుకోవడం అవివేకం అన్నారు కోటంరెడ్డి. సాక్షి ఛానెల్ కి తనను పిలిస్తే, ఈనాడు గురించి, రామోజీరావు గురించి జరిగే చర్చల్లో తాను పాల్గొంటానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
సీతారామంజనేయులు రహస్య ప్రణాళిక తనకు తెలిసిపోయిందని, ఆ విషయం తెలిసి ఆయన భయపడాల్సిన పనిలేదన్నారు. ఆయన విషయాలన్నీ తనకు తెలిసిపోతాయని, తనకు అంత నెట్ వర్క్ ఉందన్నారు. ఆయన బాగోతం మరో 6 నెలల్లో ముగుస్తుందన్నారు. ఆయన ఆటలు ఇక సాగవని చెప్పారు. ఆయన తన విధులు మరిచి, ప్రతిపక్ష నేత చంద్ర బాబు, జన సేన నేత పవన్ గురించి ఆరా తీస్తున్నారని.. టీడీపీ, జనసేన కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని చెప్పారు. లీ ఆరు నెలలే ఆయనకు అధికారం ఉందని, రాజకీయ దళారీగా చేస్తున్న వ్యవహారాలకు ఆయన తప్పక మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు.
ఇంటలిజెన్స్ చీఫ్ వ్యవహారం చూస్తూంటే.. గత ప్రబుత్వంలో ఏబీవీ ఎలా వ్యవహరించారో అంత కన్నా ఎక్కువగా సీతారామాంజనేయుులు వ్యవహరిస్తున్నారని..అలాగే ప్రభుత్వం మారిన తర్వాత ఏబీవీ కంటే ఎక్కువగా అనుభవిస్తారని టీడీపీ నేతలు హెచ్చరికలు పంపుతున్నారు.