తెలంగాణ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూలధనం, ముడిసరుకు సరఫరా విషయంపై జారీ చేసిన ఎక్స్ప్రెస్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కు బిడ్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయిందని హడావుడి చేశారు. అధికారుల బృందం సింగరేణికి వెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత తేలిందేమిటంటే..బిడ్డింగ్ దాఖలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి అర్హత లేదట. ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనలేవు. అందుకే సింగరేణిని.. లేదా ఖనిజాభివృద్ధి సంస్థనూ ఇన్వాల్వ్ చేస్తామని లీకులు ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ పప్పులేమీ ఉడకవని ముందే తెలిసినా చివరి వరకూ… ఇదిగో బిడ్డింగ్ అనే హడావుడి కొనసాగించారు.
స్టీల్ ప్లాంట్ ఆఫీసులో ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత బిడ్డింగ్‌లో పాల్గొనడానికి నిబంధనలు అంగీకరించడం లేదన్న లీకును మీడియాకు వదిలారు. సింగరేణి కూడా ప్రభుత్వ సంస్థే. కానీ స్టీల్ ప్లాంట్ తో బొగ్గుతో చేసే పనేమీ ఉండదు. ఐరన్ ఓర్ సింగరేణికి లేదు. అలాగే తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్థకు కూడా ఐరన్ ఓర్స్ లేవు. ఎలా చూసినా సాంకేతికంగా బిడ్డింగ్‌కు తెలంగాణ ప్రభుత్వానికి కానీ సంస్థలకు కానీ అర్హతలు లేవు. అయినా హడావుడి చేశారు. చివరికి చల్లబడిపోయారు. ఇప్పుడు.. తాము న్యాయ పోరాటం చేస్తామంటూ కొత్త ప్రచారం ప్రారంభించారు.
విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుని .. ఓట్ల రాజకీయం చేస్తున్నాయి. అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్లుగా ప్రజలకు సగం సగం నిజాలే చెప్పి.. వారిలో భావోద్వేగాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే.. అసలు ఏపీ అంటేనే గిట్టని బీఆర్ఎస్ నేతలు.. ఏపీలో స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని రాజకీయం చేయడం. ప్రజలు రాజకీయ చదరంగంలో పావులుగా మారిపోవడం అంటే ఇదే.