ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసేది తక్కువే కానీ.. హరీష్ రావు మాత్రం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంత చేతకాని వ్యక్తో సందర్భం వచ్చినప్పుడల్లా వివరిస్తూ ఉంటారు. తాజాగా ఆయన తెలంగాణకు.. ఏపీకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని చెప్పి.. కార్మికులంకా ఏపీలో ఓటు హక్కు వదిలేసి తెలంగాణలో నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే అందరూ కాదు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చిన వాళ్లే.
ఏపీలో రియల్ ఎస్టేట్ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పకూలిపోయింది. కూలీలు, తాపీ మేస్త్రీలు అంతా తెలంగాణ బాట పట్టారు. గత నాలుగేళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊహించనంతగా పెరిగింది. నాలుగేళ్ల కిందట ఔటర్ రింగ్ లోపలే ఇళ్ల నిర్మాణం జరిగేది కానీ ఇప్పుడు ఔటర్ కు పది కిలోమీటర్ల వరకూ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. లక్షల మంది ఏపీ నుంచి తెలంగాణకు వలస వచ్చారు. అందుకే వారంతా తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని హరీష్ రావు పిలుపునిస్తున్నారు.
గతంలోనూ జగన్ పాలనా తీరును అనేక సార్లు విమర్శించారు హరీష్ రావు. ఓ రెండు వేల కోట్ల అప్పు కోసం.. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి ఉరి వేస్తున్నారని పదే పదే వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఏపీలో ఏమీ లేదని మొత్తం అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఓ సారి హరీష్ వ్యాఖ్యలపై సజ్జల కూడా స్పందించారు. కేసీఆర్ ఫ్యామిలీలో ఏవో సమస్యలున్నాయని వైసీపీ మీద పడుతున్నారని అన్నారు. దీనిపైనా దుమారం రేగింది. తరవాత సైలెంట్ అయ్యారు.
నిజానికి తెలంగాణ ప్రభుత్వ పాలన గొప్పగా ఉందని… మంచి అభివృద్ధి జరుగుతోందని.. ప్రజలందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్పుకోవడానికి … పోలిక అవసరం. అది ఏపీకి సక్కగా సరిపోతుంది. ఏపీతో పోలిస్తే తెలంగాణ స్వర్గం అనే భావన కలుగుతుంది. దాన్ని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ మాత్రం ఏ మాత్రం మొహమాటపడటం లేదు. అలా చెప్పుకుంటున్నదు.. ఏపీ ప్రభుత్వం సిగ్గుపడటం లేదు.