పఠాన్ కోట్ పై దాడి జరిగి మూడు నెలలు పూర్తయ్యాయి కానీ ఇంతవరకు ఆ కుట్రకు పాల్పడినవారిని పాక్ ప్రభుత్వం పట్టుకోలేదు. ఈ దాడికి కుట్రపన్నిన జైష్ ఏ మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ ని గృహ నిర్బంధంలో ఉంచమని చెప్పుకొంటున్నా అది నిజమని నమ్మలేము. పాక్ ప్రభుత్వం ఆ దాడికి కుట్ర పన్నినవారిపై చర్యలు తీసుకోకపోగా, భారత్ సహకరిస్తేనే దర్యాప్తు చేసేందుకు వీలవుతుందని చెపుతూ బంతిని భారత్ కోర్టులో పడేసి చేతులు దులుపుకొంది. పఠాన్ కోట్ దాడిపై తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాస్థాయి సిట్ దర్యాప్తు బృందం త్వరలో పఠాన్ కోట్ వస్తారని వారి దర్యాప్తుకు భారత అధికారులు సహకరిస్తారని తాము ఆశిస్తున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి విదేశీ విధాన సలహాదారుగా పనిచేస్తున్న సర్తాజ్ అహ్మద్ అన్నారు.
ఆయన వాషింగ్టన్ పర్యటనలో అక్కడి మీడియాతో మాట్లాడుతూ, “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే మా వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. అయితే దానిని అమలుచేయడం అంత తేలిక కాదు. పఠాన్ కోట్ పై సాగుతున్న దర్యాప్తు పురోగతి భారత్ మాకు అందించే సహకారంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం కోసం మేము చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాము. ఇరు దేశాల సంబంధాలను దానితో సంబంధం లేని ఇతరులు ప్రభావితం చేయకుండా భారత్ జాగ్రత్తపడాలని మేము కోరుకొంటున్నాము,” అని అన్నారు.
నిజానికి భారత్-పాక్ దేశాల మధ్య చర్చలు జరపాలనుకొన్న ప్రతీసారి కూడా పాకిస్తాన్ అంతకంటే ముందుగా కాశ్మీరీ వేర్పాటు వాదులయిన హురియత్ నేతలతో చర్చలు జరపాలని పట్టుబడుతుండేది. దానిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించేది. ఆ కారణంగానే గత ఏడాది జరుగవలసిన భారత్-పాక్ చర్చలు రద్దయ్యాయి. అలాగే కాశ్మీర్ సమస్యపై అమెరికా లేదా మరో దేశాన్ని జోక్యం చేసుకోమని ఒత్తిడి చేస్తుండేది. దానినీ భారత్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ సంగతి తెలిసి కూడా పాక్ ఇప్పుడు భారత్ కి ఈవిధంగా సలహా ఇస్తుండటం విచిత్రంగానే ఉంది.
మూడు నెలలు గడిచిపోయినా ఇంకా పఠాన్ కోట్ పై దర్యాప్తు కొనసాగుతోందని ఒకసారి, భారత్ సమర్పించిన ఆధారాలు సరిపోలేదని మరొకసారి, భారత్ సహకరిస్తే తప్ప దర్యాప్తు ముందుకు సాగదని రకరకాలుగా మాట్లాడుతూ ఆ కుట్రకు పాల్పడినవారిని ఎవరినీ అరెస్ట్ చేయకుండా కాలక్షేపం చేసేస్తూనే ఇప్పుడు భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం వెంటనే జరపాలని అమెరికా వెళ్లి అక్కడి నుండి భారత్ పై ఒత్తిడి తెస్తోంది. పఠాన్ కోట్ పై దాడికి కుట్రపన్నిన వారిని పాకిస్తాన్ ఇంతవరకు అరెస్ట్ చేయకపోయినా భారత్ చాలా సంయమనం పాటిస్తూనే ఉంది. పాక్ పై ఒత్తిడి చేయలేకపోయినా ఆ దేశం చేస్తున్న ఈ ఒత్తిడి కారణంగా ఏదో ఒకరోజు విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి ఓకే చెప్పేస్తుందేమో?