నారా లోకేష్ యువగళం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి రాక ముందే హెచ్చరికలు వినిపించాయి. తన గురించి ఒక్క మాట మాట్లాడినా లోకేష్ బస చేసిన ప్రాంతం వద్దకు వచ్చి కూర్చుంటానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. తాడిపత్రి మొత్తం పెద్దారెడ్డి తెచ్చి పెట్టుకున్న పోలీసులు ఉన్నారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన డీఎస్పీ చైతన్య ఉన్నారు. ఆయన కూడా లోకేష్ వద్దకు వచ్చి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయవద్దని సూచించారు.
పాదయాత్రపై ఆంక్షలు పెట్టారు… జనాల్ని నియంత్రించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ పాదయత్ర మరింత జోరుగా సాగడానికే ఉపయోగపడ్డాయి. ఎంత అణిచివేయడానికి ప్రయత్నిస్తే అంతగా ఎగసిపడుతుందన్న నిజం బయటకు తెలిసేలా పాదయాత్ర జరిగింది. తాడిపత్రిలో నిర్వహించిన సభకు వచ్చిన జనం.. వారు చూపించిన స్ఫూర్తి చూస్తే.. వైసీపీ నాయకులకు కూడా మైండ్ బ్లాంక్ అవుతుంది. తాడిపత్రిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతకైనా తెగిద్దామని అనుకున్న వైసీపీ చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు.
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పార్టీ ఓడిపోయినప్పటి నుండి ఎన్ని కష్టాలు పడినా శ్రమిస్తూనే ఉన్నారు. జిల్లా అంతర్గత రాజకీయాల విషయంలో అసంతృప్తిగా ఉన్నా.. ఆ ప్రభావం లోకేష్ పాదయాత్రపై పడకుండా చూసుకున్నారు. ఇప్పటి జరిగిన నియోజకవర్గాల్లో పాదయాత్ర ఓ ఎత్తు అయితే.. తాడిపత్రిలో జరిగిన పాదయాత్ర ఓ ఎత్తు. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర ఇంత హైలో సాగుతుందని టీడీపీ శ్రేణులు కూడా ఊహించలేకపోతున్నారు. పక్కా వ్యూహంతో అందర్నీ కలుస్తూ సాగుతున్న లోకేష్ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ నేతలు నమ్మతుున్నారు.