స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతం ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విశాఖలో చెప్పిన మాటలను బీఆర్ఎస్ నేతలు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. తమ పోరాటం వల్లనే కేంద్రం వెనక్కి తగ్గిందిని.. కేసీఆర్ దెబ్బ.. మోదీ అబ్బ అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇలా కేంద్ర మంత్రి చెప్పిన విషయం తెలియగానే అలా కేటీఆర్ , హరీష్ రావు .. బీఆర్ఎస్ సోషల్ మీడియా అందుకుంది. హైదరాబాద్లోనే ఉంటున్న ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి కాలర్ ఎగరేసినంత పని చేశారు.
అయితే అసలు ఇప్పుడు ఎందుకింత హడావుడి చేస్తున్నారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారా అంటే.. అసలు బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయింది స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మూలధనం, ముడిసరుకు సరఫరా కోసం జారీ చేసిన ఈవోఐ బిడ్లో పాల్గొనే అంశంపై. ఈ బిడ్లో పాల్గొంటామంటూ బీఆర్ఎస్ హడావుడి చేసింది. సింగరేణి నుంచి అధికారుల బృందాన్ని పంపించి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మాత్రం తాము ప్రైవేటీకరణను ఆపివేయించామని సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలకు తామే అండగా ఉన్నామని అంటున్నారు.
అదంతా సరే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆ బిడ్ ను నిలిపివేసిందా అంటే.. అదేం లేదు. ఆ బిడ్ యధావిదిగా కొనసాగుతుంది. ఆ బిడ్ కు ప్రైవేటీకరణకు సంబందం లేదు. స్టీల్ ప్లాంట్ మూలధనం కోసం ఇచ్చిన బిడ్ అది. అందులోనే పాల్గొంటామని బీఆర్ఎస్ చెబుతోంది. పదిహేనో తేదీ లాస్ట్ డేట్. పధ్నాలుగో తేదీ సెలవు. అంటే పదిహేనో తేదీ ఒక్క రోజే మిగిలి ఉంది. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయకపోతే.. ప్రజలు మరో రకంగా అనుకునే అవకాశం ఉంది. ఇంత హంగామా చేసి.. చివరికి బిడ్ వేయకుండా.. ప్రైవేటీకరణ ఆపామని ప్రచారం చేసుకుంటే… కామెడీ అయిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.