ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రి సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలుఆధారాలు బయట పెట్టారు. స్పీకర్ డిగ్రీ చదవలేదు. కానీ ఆయన హైదరాబాద్లోని ఆ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో చేరారు. అందు కోసం తాను డిగ్రీ కంప్లీట్ చేసినట్లుగా ఓ డిగ్రీని కాలేజీకి సమర్పించారు. ఈ అంశంపై ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి వివరాలు సేకరించారు. తమ్మినేని సీతారాం ఎలా అడ్మిషన్ తీసుకున్నారని.. ఆయన విద్యార్హతలు ఏమిటని వివరాలు తెలుసుకుంటే తాను డిగ్రీ చదివినట్లుగా చెప్పి డిగ్రీని సీతారాం జత చేశారు. అయితే ఆ డిగ్రీ నకిలీదని ఆయన చెప్పిన స్టడీ సెంటర్లలో వెరీఫై చేశామని ఆయన అక్కడ చదవలేదని తేలిందని … డిగ్రీ సర్టిఫికెట్లో చెప్పిన హాల్ టిక్కెట్ నెంబర్ కూడా లేదని నర్సిరెడ్డి చెబుతున్నారు.
దీనిపై సమగ్ర విచారణ చేయాలని… నకిలీ డిగ్రీ సృష్టించి ఉంటే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ్మినేని నకిలీ డిగ్రీ అంశం ఇటీవలి కాలంలో దుమారం రేగుతోంది. ఆయన కు ఈ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తే.. నవ్వుతూ వెళ్లిపోతున్నారు. ఈ అంశం ముందు ముందు రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. అసలు ఈ వయసలో ఆయన లా చదవాలని అనుకోవడం ఏమిటి.. .. అందు కోసం నకిలీ డిగ్రీని పెట్టడం ఏమిటన్నది విస్మయం కలిగించేలా ఉందని అంటున్నారు.
అయితే ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం వారిదే కాబట్టి ఈ ఇష్యూ హైలెట్ కాకపోవచ్చు. తెలంగాణ ప్రభుత్వంతో కూడా వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి పట్టించుకోకపోవచ్చంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే ఈ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేసి… తయారు చేసిన వారిని.. కొన్న వారిని ..వాటిని ఉపయోగించుకుని కాలేజీల్లో చేరిన వారిని ఉద్యోగాలు పొందిన వారిని ముఖాలకు ముసుగులేసి పోలీసులు మీడియా ముందు పెట్టి వివరాలు వెల్లడించడానికి అవకాశం ఉంటుందని టీడీపీ నేతలంటున్నారు. దీన్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదంటున్నారు.