వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరో అరెస్ట్ చేసింది. విచారణ అధికారులు మారిన తర్వాత జరిగిన తొలి అరెస్ట్ ఇది. ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని పులివెందులలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు. ముందుగా అరెస్ట్ అని చెప్పలేదు. విచారణకు అని చెప్పారు.. తర్వాత అరెస్ట్ అని సమాచారం ఇచ్చారు. ఉదయ్ కుమార్ రెడ్డి పులివెందులలోని యూసిఐఎల్ ఉద్యోగి. అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన కదలికలు అవినాష్ రెడ్డి ఇల్లు, వివేకా ఇంటి దగ్గరే ఉన్నాయని గతంలో ప్రచారం జరిగింది.
ఉదయ్ కుమార్ రెడ్డిని 2021 సెప్టెంబర్‌లోనే అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని వదిలి పెట్టారు. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మరో సారి ఉదయ్ కుమార్ రెడ్డిని పిలిపించి ప్రశ్నించారు. అప్పట్లో మళ్లీ అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నారు కానీ అరెస్ట్ చేయలేదు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ అధికారులపై ఒత్తిడి పెరిగింది. సీబీఐ అధికారులపై రివర్స్ ఆరోపణలు చేస్తూ కొంత మంది తెరపైకి వచ్చారు. అప్పట్లో ఉదయ్ రెడ్డి అరెస్ట్ ఆగిపోయింది.
ఇప్పుడు సీబీఐ అధికారులు మొదట ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం కీలక ములుపుగా భావిస్తున్నారు. ఈ కేసులో కొత్త దర్యాప్తు అధికారులు దూకుడుగా వ్యవహరిస్తే… కేసు త్వరగా తేలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే సాంకేతిక పద్దతుల ద్వారా కీలక విషయాలను కనుగొన్నట్లుగా సీబీఐ చెబుతోంది.