తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని జాతీయ స్థాయిలో భారీ ప్రచార కార్యక్రమలు చేయించుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉదయమే వెలుగులోకి వచ్చిన ఓ వీడియో తెలంగాణలో కన్నా ఇతర రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే తెలంగాణలో వైద్య పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేందగా వైరల్ అయింది. దాదాపుగా ప్రతీ వాట్సాప్ ఖాతాకూ చేరింది.
ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ భార్య భర్త తన కుమారుడ్ని ఈడ్చుకుంటూ పోతున్నారు. ఎక్కడో అయితే సరే అనుకోవచ్చు.. కానీ అది ప్రభుత్వ ఆస్పత్రిలో. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం తన బిడ్డను తీసుకు వచ్చిన తల్లిదండ్రులు.. రెండో అంతస్తుకు తీసుకెళ్లడానికి స్ట్రెచ్చర్ దొరకలేదు. లిఫ్ట్ వరకూ అలా లాక్కుంటూ తీసుకెళ్లిపోయారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కి పడింది.
అది ఉద్దేశపూర్వకంగా తీసిన వీడియో అని.. పూర్తిస్థాయిలో ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇలా చేశారని చెప్పుకుంది. ప్రభుత్వం ఎన్ని చెప్పినా అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత కవరింగ్ అనే అనుకుంటారు.ఇక్కడాఅదే జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ వాదన ఎవరికీ పట్టడం లేదు. ఆ వీడియో మాత్రమే వైరల్ అవుతోంది. సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వం తంటాలు పడుతోంది.