అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. ఈనెల 28న విడుదల అవుతోంది. ఇంకో 15 రోజుల సయం కూడా లేదు. అందుకే ఇప్పుడు ప్రమోషన్ల హడావుడి మెల్లగా మొదలెట్టింది చిత్రబృందం. ముందు నుంచీ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని చెబుతూ వచ్చారు. సడన్‌గా ఇప్పుడు హిందీలో రిలీజ్ చేయడం లేదని తెలిసింది. దీనిపై అఖిల్ క్లారిటీ ఇచ్చారు. ఇది పాన్ ఇండియా సినిమానే అని, కాకపోతే.. హిందీలో రిలీజ్ కాస్త ఆలస్యంగా విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ”ఇది తెలుగు సినిమా. పాన్ ఇండియా స్థాయిలో వెళ్తోంది. పాన్ ఇండియా అంటే.. అన్ని చోట్లా మంచి రిలీజ్ డేట్ కుదరాలి. 28 రూపంలో తెలుగులో మంచి డేట్ దొరికింది. అయితే హిందీలో రిలీజ్ చేయడానికి మాత్రం కొంచెం టైమ్ పడుతుంది. పబ్లిసిటీ చేయడానికి కూడా మా దగ్గర టైమ్ లేదు. కాంతార లాంటి సినిమాలు హిందీలో ఆలస్యంగా విడుదలైనా మంచి విజయాన్ని అందుకొన్నాయి. నాకు తెలుగులో ఈ సినిమా బాగా ఆడడం ముఖ్యం. అందుకే తెలుగుపై దృష్టి పెట్టా” అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని, అఖిల్ మార్కెట్ రేంజ్ ని దాటిపోయిందని నిర్మాత ఈ సినిమాపై భారీ రిస్క్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అనిల్ సుంకర స్పందించారు. ”హీరోని బట్టి మార్కెట్ అనేది లేదు. బాహుబలికి ముందు ప్రభాస్ ఒకలా ఉన్నారు. ఆ తరవాత ఆయన రేంజ్ మారింది. కథపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా తరవాత అఖిల్ స్టార్ అవ్వబోతున్నాడు. అందుకే ఇంత ఖర్చు పెట్టగలిగాం” అని చెప్పారు.