విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఏపీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి చేసుకుంటోంది. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రభుత్వమే దిగుమతి చేసుకొని బార్లు, మద్యం షాపులకు సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం, బార్ పాలసీ తీసుకొచ్చింది. ప్రైవేటు నిర్వహణలోని మద్యం షాపులను స్వాధీనం చేసుకొని షాపుల సంఖ్యను కుదించింది. గతంలో మద్యం సరఫరాకే పరిమితమైన ఏపీబీసీఎల్కు షాపుల నిర్వహణ బాధ్యతను కూడా అప్పగించింది.
అయితే పాత బ్రాండ్లన్నీ ఆపేసి.. కొత్త బ్రాండ్లను మాత్రమే అమ్ముతున్నారు. చీప్ లిక్కర్ అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో బ్రాండ్ల అంశాన్ని మరుగున పర్చడానికి పాత బ్రాండ్లను అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించారు. అయితే ఆయా సంస్థలు డిస్టిలరీలు మూతబడ్డాయి . ఆ కంపెనీలు లైసెన్స్లు కూడా రెన్యువల్ చేసుకోలేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఒకే చెప్పింది.
ఇందులో భాగంగా దిగుమతి సుంకం కట్టించుకొని పాత బ్రాండ్ల మద్యం ఏపీబీసీఎల్ దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఇంపోర్టెడ్ లేబుల్ వేసి బార్లకు, మద్యం షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల మద్యం అమ్మినా, దగ్గర ఉంచుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే అధికారికగా దిగుమతి చేసుకుంటోంది. కొన్ని బ్రాండ్లు గోవా, ఢిల్లి, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని ఏపీబీసీఎల్ డిపోలకు తరలించిన తర్వాత ఇంపోర్టు స్టిక్కర్లు వేసి షాపులు, బార్లకు సరఫరా చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా.. సరైన పద్దతిలోతీసుకోలేదు. ప్రతీది రాష్ట్ర ప్రజల్ని .. రాష్ట్రాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేసే తాము మాత్రం ఆర్థికంగా లాభపడే నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటివి ఇప్పుడు బయటపడుతున్నాయి.