ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు మెల్లగా కేసీఆర్ పేరునూ బయటకు తెస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి సుదీర్ఘంగా ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఏం ప్రశ్నించారన్న విషయం అధికారికంగా బయటకు రాదు కానీ.. అనధికారికంగా మాత్రం కేజ్రీవాల్ – కేసీఆర్ బంధంపై ఆరా తీసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా పరిచయాల మధ్యలో ఆర్థిక వ్యవహారాలు ఎందుకు వచ్చాయన్న కోణంలో కేజ్రీవాల్ నుంచి వివరాలను సీబీఐ సేకరించినట్లుగా తెలుస్తోంది. వివిధ పద్దతుల ద్వారా హైదరాబాద్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సాయం చేరిందని అది ఎందుకు ఇచ్చారని సీబీఐ అధికారులు ప్రశ్నించారని చెబుతున్నారు.
ఉత్తరాది ప్రాంతీయపార్టీలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి కూడా కేసీఆర్ .. సాయం చేశారని అంటున్నారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో తెలంగాణ నుంచి వచ్చిన ధనమే ఖర్చు పెట్టారని సీబీఐ చెబుతోంది. ఇదంతా కేసీఆర్ ప్రమేయం లేకుండా జరగదని… ఆయనతో ఆర్థిక సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి.,.. ఎలా కొనసాగుతున్నాయన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో సంచలనం అవుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకూ కవిత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమెను ఈడీ ప్రశ్నించింది. కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆమె ప్రస్తుతానికి బెడ్ రెస్టులో ఉన్నారు. ఈ లోపే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ ను కూడా ప్రశ్నించి..కేసీఆర్ ప్రస్తావన తేవడంతో.. కవితతో పాటు కేసీఆర్ ప్రమేయం కూడా ఉందన్న సంకేతాలను సీబీఐ ఇచ్చిందని చెబుతున్నారు. ముందు ముందు ఈ కేసులో పరిణామాలు ఎటు తిరుగుతాయో కానీ.. కేసీఆర్ పేరు మాత్రం వ్యూహాత్మకంగానే తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.