ఖమ్మం బీఆర్ఎస్ మాజీ నేత , బడా కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ను బెదిరిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే నిర్వహించిన ఓపెన్ హార్ట్ ఇంటర్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఆ సొమ్ముతోనే దేశ వ్యాప్తంగా రాజకీయం చేయాలనుకుంటున్నారన్న ఆరోపణల్ని బలపరిచేలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్లు చేస్తున్నారు. తనకు కేసీఆర్ వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని.. వాటిలో ఆరు శాతం పర్సంటేజీలు ఆయనకు ఇచ్చానని దానికి ఆధారాలు ఉన్నాయని పొంగులేటి నేరుగానే చెప్పారు.
కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుతోపాటు అనేక కాంట్రాక్టులు మేఘా సంస్థకే దక్కాయి. ఆయా సంస్థలే కేసీఆర్ కు ప్రధాన ఆదాయ వనరు అనే ప్రచారం ఉంది. జగన్ కు సన్నిహితుడుగా ముద్రపడిన పొంగులేటి. .. జగన్ సూచనతోనే బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయన కు ఎలాంటి పదవులు ఇవ్వడానికి కేసీఆర్ ఆసక్తి చూపలేదు. చివరికి టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. దీంతో పొంగులేటి ఇటీవల ఏపీలో ఎక్కువ కాంట్రాక్టులు పొందుతున్నారు. వేరే పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
మరి కాంట్రాక్టులు ఇచ్చినందుకు కేసీఆర్ కు పర్సంటేజీలు ఇచ్చిన పొంగులేటి… ఇప్పుడు ఏపీలో తీసుకుంటున్న కాంట్రాక్టుల కోసం ఎవరికి పర్సంటేజీలు ఇస్తున్నారు అనేది చర్చకు వస్తుంది. ఇటీవల ఏపీలో ప్రతీ దాంట్లోనూ పొంగులేటి కంపెనీలకు కాంట్రాక్టులు వస్తున్నాయి. చివరికి మీటర్లు పెట్టే కాంట్రాక్టు కూడా వచ్చింది. మైనింగ్ సీవరేజీ వసూలు… ఉత్తారంధ్రలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు కూడా వస్తున్నాయి. దీనికి ఎంత పర్సంటేజీ ఇస్తున్నారో ఇచ్చారో… కేసీఆర్ తో చెడినట్లుగా జగన్ తో చెడి న తర్వాత బయటపెడతారేమో. ఆయన మాటల్ని బట్టి ఇలాంటి వాటికి ఆధారాలు ఎప్పుడూ దాచి పెట్టుకుంటారని అర్థం చేసుకోవచ్చు.