సురేందర్ రెడ్డి డీసెంట్ ఫిల్మ్ మేకర్. తను అనుకున్నది ఎక్కడా రాజీ పడకుండా తీస్తాడు. అఖిల్ తో చేస్తున్న ఏజెంట్ ఎంత ఆలస్యమౌతున్నప్పటికీ సురేందర్ రెడ్డి ఎదో కొత్తగా ప్రయత్నించుంటారనే నమ్మకం కొందరిలో వుంది. అయితే ఏజెంట్ వరస చూస్తుంటే ఇదీ ఒక రెగ్యులర్ సినిమానే అభిప్రాయం కలుగుతుంది. దీనికి కారణం వుంది.
‘ఏజెంట్’ ది స్పై థ్రిల్లర్ జోనర్. అసలు ఇలాంటి సినిమాలకు పాటలే పెద్ద అడ్డంకి. కానీ ఏజెంట్ మాత్రం దీనికీ భిన్నంగా వుంది. ఈ సినిమాకి హిప్ హప్ తమిళ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే మూడు పాటలని వదిలారు. విడుదల చేయడానికి ఇంకో పాట వుంది. ఈ గ్యాప్ లో మరో పాట కూడా చేరిపోయింది. ఈ పాట సగటు హిట్ ఫార్ములాని అనుసరించి చేరిందే.
ఇప్పటి వరకూ విడుదలైన ఏజెంట్ పాటల్లో ఒక్కటి కూడా క్యాచి అనిపించుకోలేదు. దీంతో ఇటివలే ధమాకాతో మాస్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ తో ఓ ఐటెం పాట చేయించారు. భీమ్స్ మాస్ పల్స్ తెలిసిన కంపోజరే. అయితే ఆయన టచ్ ఏజెంట్ కి ఎలా వర్క్ అవుతుందనేది ఇక్కడ ప్రశ్న. ఈ వరుస చూస్తుంటే.. ఐదు పాటలు నాలుగు ఫైట్లు వున్న మామూలు రెగ్యులర్ సినిమా ఏజెంట్ అని చెప్పకనే చెప్పినట్లౌతుంది.