ఏపీ ఉద్యోగ సంఘాల్లో ఒక్క బొప్పరాజు వెంకేటేశ్వర్లు నేతృత్వంలోని ఏపీజేఏసీ అమరావతి మాత్రమే ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కనీసం జీతాలు కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ కూడా సీఎస్ కు ఇచ్చి అమలు చేస్తున్నారు కూడా. ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు ఉన్నప్పటికీ… ప్రభుత్వంపై ఆయన పోరాడుతున్న తీరు మాత్రం ప్రత్యక్షంగానే ఉంది.
కానీ బొప్పరాజు తరహాలో ఇతర ఉద్యోగ సంఘ నేతలెవరూ స్పందించడం లేదు. ఎపీ ఎన్జీవో అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన బండి శ్రీనివాసరావు ఎప్పుడోఒకప్పుడు తీతాలిస్తున్నారు కదా సరిపోతుందిలే అన్నట్లుగా ఉన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల గురించి ఆయనేం మాట్లాడటం లేదు. ఇక సచివాలయ నేత వెంకట్రామిరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ప్రభుత్వమే ముఖ్యం. తనను ఎన్నుకున్న ఉద్యోగులు ఏమైపోయినా ఆయన పట్టించుకోరు. ఇక కేఆర్ సూర్యనారాయణ అనే మరో ఉద్యోగ సంఘం నేత ప్రకటనలు భీకరంగా ఉంటాయి కానీ… కార్యాచరణకు వచ్చే సరికి.. సైలెంట్ గా ఉంటారు.
ఉద్యోగులకు గతంలో ఎప్పుడూ జరగనంత నష్టం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగింది. అది ఆర్థిక నష్టాలే కాదు .. అవమానాలు కూడా., ఉద్యోగుల్ని ఒక్కరూ గౌరవంగా చూడటం లేదు. కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. ఎంతగా అవమానించాలంటే అంతగా అవమానిస్తున్నారు. డీఏలు ఇవ్వడం లేదు. పీఆర్సీ ఏర్పాటు చేయడం లేదు. అయినా ఉద్యోగ నేతలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. వీరంతా వ్యక్తిగత ప్రయోజనాలు పొంది లైట్ తీసుకుంటున్నారు. ఉద్యోగుల భవిష్మత్ను పణంగా పెడుతున్నారు.