తెలుగు సినిమా మార్కెట్ పై బాలీవుడ్ గట్టిగా దృష్టి పెట్టింది. ఇక్కడి నుంచి వచ్చే వసూళ్లపై వాళ్లకు చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. అందుకే బాలీవుడ్ సినిమాల్ని తెలుగులో గట్టిగా ప్రమోట్ చేసుకొంటున్నారు. ఇలాంటి ట్రెండ్ ని సల్మాన్ ఫాలో అవుతున్నాడా, లేదా? అనే అనుమానం వేస్తోందిప్పుడు. సల్మాన్ కథానాయకుడిగా నటించిన `కిసీకా భాయ్.. కిసీకా జాన్` రేపే విడుదల అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగులో ఎలాంటి ప్రమోషన్లూ లేవు. తెలుగు మార్కెట్ ని సల్మాన్ పట్టించుకోలేదా? అంటే.. అదేం లేదు. ఈ సినిమాలో వెంకటేష్ ఉన్నాడు. తెలుగు వాళ్లకు అత్యంత ఇష్టమైన పూజా హెగ్డే ఉంది. అన్నింటికంటే మించి రామ్ చరణ్ ఓ పాటలో స్పెషల్ ఎప్పీరియన్స్ ఇచ్చాడు. ఇవన్నీ వాడుకొని.. తెలుగులో గట్టిగా ప్రమోట్ చేసుకోవాల్సిన సినిమా ఇది. కానీ… తెలుగులో సల్మాన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక్కసారి కూడా హైదరాబాద్ లో అడుగు పెట్టలేదు.
మల్టీప్లెక్స్‌లలో… సల్మాన్ సినిమాల్ని బాగా చూస్తారు. వెంకీ, పూజా, చరణ్‌ల కోసం.. బీసీ సెంటర్లలోనూ ఈ సినిమా చూసే ఛాన్సుంది. ఈ ప్లస్ పాయింట్ ని చిత్రబృందం సరిగా వాడుకోవడం లేదు. రేపు… ఈ సినిమాతో పాటు విరూపాక్ష విడుదల అవుతోంది. తెలుగు ప్రేక్షకుల మొదటి ఛాయిస్.. విరూపాక్షనే. ఆ తరవాతే.. భాయ్ సినిమాకి వెళ్తారు. సల్మాన్ చేస్తున్న `లో` ప్రమోషన్లు చూస్తుంటే.. సెకండ్ ఆప్షన్‌గా కూడా ఈ సినిమాని పరిగణించరేమో అనిపిస్తోంది.