వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో .. వారికి శిక్ష పడాల్సిందేనని వైఎస్ సునీత పోరాడుతున్నారు. మామూలుగానే ఈ కేసులో నిందితులు చేస్తున్న ప్రయత్నాలు… ఎలా ఉన్నాయో… చూస్తే ఆమెపై ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినప్పటికీ అపోలోలో సీనియర్ డాక్టర్ గా ఆమె విధులు నిర్వహిస్తూనే …తన తండ్రి హంతకులకు శిక్షపడేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆమెపై తాజా రాజకీయ కుట్రను వైసీపీ వర్గాలు ప్రారంభించాయి. ఆమె టీడీపీ తరపున పోటీ చేస్తారని.. నీలి, కూలి మీడియాల్లో ప్రచారం ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వైఎస్ వివేకా కుమార్తె సునీత కలిశారని ఎందుకు కలిశారో చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఆయన సునీత వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తుందని కూడా అన్నారు. అసలు సునీత చంద్రబాబును ఎప్పుడు, ఎక్కడ కలిశారో ఆయన చెప్పాల్సింది . కానీ చెప్పలేదు. ప్రజల్లో ఓ తప్పుడు భావన వ్యాప్తి చేయడానికి.. సునీత పోరాటంలో రాజకీయం ఉందని చెప్పడానికి సజ్జల అలాంటి ప్రకటన చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వైఎస్ సునీత ఇప్పటి వరకూ రాజకీయ పరంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా కూడా చెప్పలేదు. ఏ టీడీపీ నేతనూ కలవలేదు. నిజానికి సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అనుమానించిన వ్యక్తుల జాబితాలో ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి వంటి పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఆమెకు తెలుగుదేశం పార్టీతో సంబంధాలున్నాయని చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కడప లోక్సభ పరిలో టీడీపీ తరపున వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత బరిలోకి దిగబోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. కానీ సునీత మాత్రం రాజకీయంగా తన ఆసక్తిని ఒక్క సారి కూడా వ్యక్తం చేయలేదు.