సాధారణంగా స్టార్ హీరోతో.. ఓ అగ్ర శ్రేణి దర్శకుడి సినిమా అంటే… ఫ్యాన్స్ అంతా ఏం ఆలోచిస్తారు? ‘మా హీరోని ఈ దర్శకుడు ఎలా చూపించబోతున్నాడు’ అనే కదా? కానీ, మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా అనేసరికి జనాల ఎక్స్పెక్టేషన్స్ వేరేలా కూడా ఉంటాయి. ‘మహేష్ ఎలా మాట్లాడతాడు? తన డైలాగ్ డెలివరీ ఎలా ఉండబోతోంది?’ అని. ఎందుకంటే ‘అతడు’లో మహేష్ చాలా తక్కువ మాట్లాడతాడు. అయితేనేం ప్రతీమాటా బుల్లెట్ లా దూసుకుపోతుంది. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సెటిల్డ్ గా ఉంటుంది.
ఆ తరవాత వచ్చిన ‘ఖలేజా’ చూడండి. మరో మహేష్ కనిపిస్తాడు. అందరికంటే.. ఎక్కువ డైలాగులు మహేష్‌కే ఉంటాయి. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతాయి. ఆ సినిమాలో అవసరం ఉన్నా, లేకున్నా మహేష్ మాట్లాడేస్తుంటాడు. అతడుకీ, ఖలేజాకీ అస్సలు సంబంధమే ఉండదు. ఆ సినిమా ఆడకపోయినా.. మహేష్ డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కి భలే నచ్చింది.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబో సెట్ అయ్యింది. మరి ఈసారి మహేష్‌ని త్రివిక్రమ్ ఎలా వినిపిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాలో మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. ఇది వరకు సినిమాలకూ, ఈ సినిమాకూ అస్సలు పొంతన లేని డైలాగ్ మాడ్యులేషన్ తో మహేష్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే కూడా ఇదే మాట చెబుతోంది. మహేష్ డైలాగ్ మాడ్యులేషన్‌కి ఫిదా అయిపోయానని, తనని కొత్తగా చూడబోతున్నారని ఫ్యాన్స్‌కి ఓ హింట్ ఇచ్చింది పూజా. మరి.. ఆ సర్ప్రైజ్ మాడ్యులేషన్ ఎలా ఉందో తెలియాలంటే.. కనీసం టీజర్ అయినా బయటకు రావాల్సిందే.