వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం అమ్మేస్తోందని మేము కొనేస్తామని బిడ్ కూడా దాఖలు చేస్తామని హడావుడి చేసిన తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ చివరకు చల్లబడిపోయింది. భీకరమైన ప్రకటనలు చేసి చివరికి చప్పుడు చేయకుండా ఉండిపోయింది. సింగరేణి అధికారులు అడిగారనే ఐదు రోజులు గుడువును స్టీల్ ప్లాంట్ పెంచినా పట్టించుకోలేదు. స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్ల దాఖలకు సమయం అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వం
సింగరేణి యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించి.. ఉన్నతాధికారులతో సమావేశం అయింది. వివరాలు తీసుకుని తర్వాత అన్ని వివరాలతో సమగ్రంగా నివేదిక రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే బిడ్ వేయడానికి సింగరేణి ఏర్పాట్లు రెడీ చేసుకుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బిడ్ వేయాలని సింగరేణికి చెప్పలేదు. ఒక వేళ సింగరేణికి బిడ్ లభిస్తే.. అందు కోసం కనీసం రూ. ఐదు వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. సింగరేణికి అది పెద్ద భారం అవుతుందన్న అభిప్రాయం ఉంది.
ఇప్పటికే సింగరేణి ఆర్థిక స్థితిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో తెరిపిస్తామని హామీ ఇచ్చిన అనేక పరిశ్రమలను తెలంగాణ సర్కార్ తెరిపించలేకపోయింది. వాటిని తెరిపించకుండా వేలకోట్లను ఏపీలో ఉన్న పరిశ్రమ కోసం తరలిస్తే.. తెలంగాణలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ని ప్రభుత్వ వర్గాలు భావించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సింగరేణికి మూలధనం ఇచ్చేంత ధనం ఉంటే.. ముందుగా నిజాం షుగర్స్ ను తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా చిక్కులు వచ్చే పరిస్థితి తలెత్తింది. చివరికి సైలెంట్ గా ఉండటమే మంచిదని డిసైడయ్యారు.