వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హత్యలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు. అది కూడా రూ.కోట్లలోనే. రూ. 40 కోట్ల డీల్ జరిగిందన్న విషయం బయటపడింది. కేవలం మాటల్లోనే కాదు ఈ నగదు చేతులు మారిందని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చి మరీ వైఎస్ వివేకాను చంపించాల్సిన అవసరం ఏమిటనేది ఇప్పుడు కీలకంగా మారింది.
దస్తగిరి తనకు రూ. కోటి అందాయని చెబుతున్నారు. సీబీఐ అధికారులు ఎవరి వద్ద నుంచి అందాయి.. .ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ? అనేది బయటకు లాగారు. సునీల్ యాదవ్ కూ కోటి ఇచ్చారు. మిగిలిన డబ్బులూ ఇతర నిందితుల వద్దకు చేరాయన్న అనుమానాలుఉన్నాయి. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొన్ని లక్షల రూపాయలు చేతులు మారాయని ఫిర్యాదు రాగానే ఈడీ కేసు నమోదు చేసింది. సొంతంగా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించింది. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీకి సీబీఐ అధికారులు మనీ లాండరింగ్ వివరాలు ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపోమాపో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. చేతులు మారిన డబ్బును ఎలా సమీకరించారు..ఎవరు తీసుకు వచ్చారు… ఎవరికి ఇచ్చారు..అనేది ఈడీ తేల్చేస్తే.. అసలు నిందితులెవరో స్పష్టత వస్తుంది. ఈ దిశగా ఇప్పటికే ఈడీ అంతర్గత దర్యాప్తు జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.