తెలంగాణ రాజకీయాల్లో తన మనిషిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గుర్తింపు ఇస్తున్న సీఎం జగన్ ఏపీలో రూ. వేల కోట్ల కాంట్రాక్టులు కట్ట బెడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. జగన్ తో పలుమార్లు సమావేశమైన తర్వాత చివరికి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం కూడా జగన్ తో పొంగులేటి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని ఆయనకు జగన్ సూచించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
రెండు రోజుల కిందట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులకు సీట్లు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలం లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లడం కన్నా కాంగ్రెస్ లో చేరితేనే బెటరని నిర్ణయించుకున్నారు. పొంగులేటి గెలిపించుకునేవారంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అయినా ఎన్నికల తర్వాత గేమ్ ఆడవచ్చన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
మరోవైపు మాజీ మంత్రి జూపల్లితో కూడా కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే సీనియర్ నేతలు అవసరమని భావిస్తున్న కాంగ్రెస్.. ఆ దిశగా అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్, బీజేపీలపై అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఆ ఆపరేషన్ లో భాగంగానే జూపల్లి, పొంగులేటిని హస్తం పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే ఈ నెల 30న ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.