కేసీఆర్ దెబ్బకు కేంద్రం అబ్బ అందని.. ఇక విశాఖలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని తోట చంద్రశేఖర్ గర్వంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ కనీసం బిడ్లో కూడా పాల్గొనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం పేరుతో ఏపీలో అడుగు పెట్టాలనుకున్న భారత రాష్ట్ర సమితి పరిస్థితులు అనుకూలించలేదు. స్టీల్ ప్లాంట్ కార్మికసంఘ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకి బిడ్ ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీలో బహిరంగసభ పెట్టాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురయినట్లు అయింది.
కేసీఆర్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ను పార్టీలోకి తేవాలనుకున్నారు. ఆయనతో చర్చలు కూడా జరిపారు. అయితే బీఆర్ఎస్కు ఏపీలో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయన ఆలోచిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉపయోగపడుతుందనే పరిస్థితులు వచ్చాయి. బిడ్ వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు మొదట లక్ష్మినారాయణే కేసీఆర్ ను పొగిడారు. కానీ ఇప్పుడు బిడ్ వేయకపోవడంతో ఆయన కూడా బీఆర్ఎస్లో చేరికపై ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పటికీ.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఇంకా దృష్టి పెట్టలేదు. మహారాష్ట్రలో మాత్రం వరుసగా మూడు సభలు పెడుతున్నారు. ఇతర రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ఉన్న కర్ణాటకపై అసలు దృష్టి పెట్టలేదు. ఏపీ, ఒడిషాలకు ఇంచార్జుల్ని నియమించినప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఏపీలో అడుగు పెట్టడానికి పరిస్థితులు కలసి రావడం లేదు.