నాటు నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా టీంకు అమిత్ షా విందు ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిచి స్పెషల్ గా అదే ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే.. రాజకీయ ఉద్దేశాలు లేవు అనుకోవచ్చు. కానీ రాజకీయ పర్యటన కోసం తెలంగాణకు వస్తున్న ఆయన ఓ అరగంట విందు కోసం కేటాయించారు. ఈ మేరకు ట్రిపుల్ ఆర్ టీంకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఈ విందు భేటీ జరగనుంది.
నిజానికి ఆర్ ఆర్ ఆర్ టీం ఆస్కార్ అవార్డుల తర్వాత విడివిడిగా ఇండియాకు చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇండియాకు వచ్చిన తర్వాత అమిత్ షాను కలిశారు. అప్పుడు చిరంజీవి, రామ్ చరణ్‌లను అమిత్ షా సత్కరించారు. అలాగే సినిమా ఇంకా ఆస్కార్ విజయం సాధించకముందు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను హోటల్‌కు పిలిపించుకుని అభినందించారు. అయితే ఇప్పుడు అధికారికంగా టీం మొత్తానికి సన్మానం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
రాజకీయంగా ఉపయోగపడే ఏ చిన్న చాన్స్ వచ్చినా అమిత్ షా లాంటి వాళ్లు వదిలి పెట్టరన్న అభిప్రాయం ఉంది . ఆర్ ఆర్ ఆర్ టీం ద్వారా వీలైనంతగా పొలిటికల్ గెయిన్ పొందాలన్న వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ విషయం నిజమే అయినా ట్రిపుల్ ఆర్ టీం ఈ విందును ఎవాయిడ్ చేయలేదు.. ఎందుకంటే.. పిలిచిన వ్యక్తి ఆషామాషీ కాదు మరి !