తెలంగాణలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ నేత ఈటల రాజేందర్ సంబంధం లేకుండా మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ రూ. పాతిక కోట్లు తీసుకుని ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఆరోపించారు. దీంతో రేవంత్ రెడ్డి ఒక్క సారిగా తెరపైకి వచ్చారు. చాలెంజ్‌లు చేశారు. బీజేపీకి ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరే తడిబట్టలతో చాలెంజ్ చేస్తానని.. ఈటల రావాలని సవాల్ చేశారు. శనివారం మొత్తం ఈ విషయాన్ని హైలెట్ చేసుకోవాలనుకుంటున్నారు.
అయితే ఈటల , రేవంత్ ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాన్ని ఎత్తుకున్నారన్న అనుమానం బీఆర్ఎస్ లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ తన ప్రత్యర్థి ఎవరో ఎంపిక చేసుకుంటూ వారిపైనే ఎక్కువగా దృష్టి పెట్టి టార్గెట్ చేస్తోంది. అత్యధిక సార్లు ఆ ప్రత్యర్థి బీజేపీనే అవుతోంది. దీతో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోతోంది. ఇదే ఫార్ములాతో అసలు బీఆర్ఎస్ ను రేసులో లేకుండా చేయడానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయం మారడానికి రేవంత్, ఈటల ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. అందుకే సందర్భం లేకుండా ఆరోపణలు చేసుకుని చాలెంజ్ లు చేసుకున్నారని విమర్శిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతానికి ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఓ పార్టీని ఎలిమినేట్ చేయాలని ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. త్రిముఖ పోరు ఉండాలని బీఆర్ఎస్ కోరుకుంటోంది. ఓట్ల చీలిక కలిసి వచ్చే అవకాశం ఉందని అనుకుంటోంది. అదే విధంగా ఇతర పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కూడా ద్విముఖ పోరు ఉండాలనుకుంటున్నాయి.. అది తామే అవ్వాలనుకుంటున్నారు. అందుకే రాజకీయాలు భిన్నంగా మారిపోతున్నాయి.
ఈటల చేసిన వ్యాఖ్యలపై రేవంత్ సవాల్ ను బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుంటుందన్నది కూడా ఇక్కడ కీలకమే. ఈటలను బండి సంజయ్ దూరం పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈటలకు మద్దతుగా బీజేపీలో ఎంత మంది ముందుకు వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇది కూడాఓ వ్యూహమేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.