ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పేరు మార్చేశారు. జరిగి నెలలు అవుతుంది. అయితే హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం అంటే… అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నంత ఈజీ కాదని.. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ముడిపడిన విషయం కాదని.. పై స్థాయిలో చాలా వ్యవస్థల ఆమోదం పొందాల్సి ఉంటుందని ముందుగానే చెప్పుకున్నారు. అయితే ప్రభుత్వ పాలకుడు మాత్రం తమకు 151 సీట్లు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేయగలమని అనుకుంటారు అందుకే ఆయన ఇలా బిల్లు పాస్ చేయించి.. అలా బోర్డు మార్పించారు.
కానీ సర్టిఫికెట్లలో మాత్రం మారడంలేదు. తాజాగా జాతీయ వైద్య కమిషన్ నంద్యాల మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఇలా అనుమతి ఇస్తూ ఆ మెడికల్ కాలేజీ ఏ యూనివర్శిటీ పరిధిలో ఉందో చెప్పింది. ఆ యూనివర్శిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో నంద్యాల మెడికల్ కాలేజీ ఉంటుందని.. స్పష్టం చేసింది. దీంతో జాతీయ వైద్య కమిషన్ ఇంత వరకూ పేరు మార్పును గుర్తించలేదని స్పష్టమయింది.
మిగతా యూనివర్శిటీల్లా పేరు మార్పు కాదని.. ఇంకా చాలా చిక్కులు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రెండు, మూడేళ్లయినా అవి తీరని చెబుతున్నారు. ఈలోపు ప్రభుత్వం మారితే.. పేరు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే.. మొత్తం సమస్య పరిష్కారమవుతుంది. ప్రభుత్వం .. మంద బలం ఉందని అడ్డూ అదుపూ లేకుడా తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి ఆ పార్టీ కే సమస్యగా మారుతున్నాయి. ఏమీ చేతకాదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.