రాజకీయాల్లో ప్రముఖ నేతల కంటతడి సెంటిమెంట్ ఎంతలా వర్కవుట్ అవుతుందో అంచనా వేయడం కష్టం. ఓ నేత కష్టంపై సానుభూతిని ఓట్లుగా మల్చుకునే విషయంలో ఈ కంటతడి ఓటర్ల మనసులో ఓ ఓటు వేద్దాం అనుకునేలా చేస్తుంది. అలాంటి ఫీలింగ్ వస్తే ప్రభంజనమే. గతంలో చాలా ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు చూశాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడాఇదే ఫార్ములాను అమలు చేసేశారు.
కేసీఆర్ వద్ద తాను డబ్బులు తీసుకున్నానని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్ని సీరియస్ గా తీసుకుని.. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై తాను ఎంత తీవ్రంగా పోరాడుతున్నాననో చెప్పుకున్నారు. తాను ఎన్ని ఇబ్బందులు పడ్డానో చెప్పారు.కేసీఆర్ ను ఓడించడానికి జీవితాల్నే పణంగా పెట్టామని బలంగా చెప్పారు. ఓ దశలో ఆవేదనతో కంట తడి పెట్టారు.
కేసీఆర్పై పోరాటంలో రేవంత్ రెడ్డిని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు. రేవంత్ కు తెలంగాణలో ఎవరు ధీటైన నేత అంటే అత్యధిక మంది రేవంత్ రెడ్డి పేరే చెబుతారు. కానీ బీజేపీకి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ఆ పార్టీ కూడా పోటీకి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. అయినా రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో తనను కించపరుస్తున్నా.. పార్టీ గెలుపు కోసం ఆయన శ్రమిస్తున్నట్లుగా ఎవరూ కష్టపడటం లేదు. ఇవన్నీ ప్రజల ముందు ఉంచి.. కంటతడి పెట్టారు రేవంత్ రెడ్డి .
ఈటల రాజేందర్ కూడా.. రేవంత్ రెడ్డి విషయంలో తాను ఆధారాలు లేని ఆరోపణలు చేశానని ఒప్పుకున్నారు. ఎవర్ని కించపర్చలేదన్నారు. ఓ రకంగా ఈటల చేసిన ఆరోపణల్ని రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వినియోగించుకుని తెలంగాణ రాజకీయాల్లో ఓ ఎఫెక్ట్ తెచ్చారని చెప్పుకోవచ్చు.