వైసీపీ ఇప్పుడు గాల్లో తేలిపోతోంది. ప్రజల్లో అసలు వ్యతిరేకత లేదని తమకు వస్తున్న మిస్డ్ కాల్స్ నిరూపిస్తున్నాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. తాము గతంలో ఏ పాలకులూ చేయనంత మేలు ప్రజలకు చేశామని అనుకుంటున్నారు. దానికి ఫలితమే ఈటీజీ సర్వే అంటున్నారు.పాతిక పార్లమెంట్ సీట్లూ తమవేనని ఎవరూ కాదనలేరు.. అంటున్నారు. వైసీపీ నేతల ఉత్సాహం ప్రకారం చూస్తే.. మరికొన్ని జాతీయ మీడియా పేరుతో ఊరూపేరూ సర్వేలు వస్తాయని.. తర్వాత ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లకపోతే… వచ్చే మార్చి నాటికి ముందుగా ఆర్థిక పరిస్థితిని తట్టుకోవడం కష్టం. ఇప్పటికే ప్రతీ నెలా కేంద్రంవద్దకు వెళ్లి ఎప్పటికప్పుడు అప్పులకు అనుమతులు తెచ్చుకుంటేనే ఓడీ వంటిఉపద్రవాల నుంచి బయటపడాల్సి వస్తోంది. పథకాలన్నీ పెండింగ్ పడిపోతున్నాయి. ఈ సమస్యలకు తోడు కేసులు వెంటాడుతున్నాయి. గతంలో అన్నీ కలిసి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అయిన వాళ్లంతా దూరమయ్యారు. ఎలా చూసినా ఎన్నికలు ఎంత త్వరగా పెట్టుకుంటే అంత మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
జగన్ విశాఖ కు సెప్టెంబర్ కాపురం కామెంట్ల వెనుకా అదే ఉందని నమ్ముతున్నారు. ఉత్తరాంధ్రలో పరిస్థితి బాగోలేకపోవడంతో.. సెప్టెంబర్ లో వివాదాస్పదంగా అయినా రాజధాని ప్రకటించేసి అక్కడకు వెళ్తే.. సెంటిమెంట్ పెరుగుతుందని నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. ముందు ముందు ఈ అంశంపై మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ఇటీవల సహకరించడం తగ్గించింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటున్నా… కేంద్రాన్ని ఏమీ అనలేని పరిస్థితి. అయినప్పటికీ ముందస్తు ఎన్నికలకు కేంద్రం సహకరిస్తుందనే నమ్ముతున్నారు.
క్లీన్ స్వీప్ కాకపోతే కనీసం గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని లేకపోతే.. ముందుగానే అధికారం కోల్పోవడం ఎందుకన్న ఉద్దేశంతో మామూలు సమయంలోనే ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయం వైసీపీలోనే గట్టిగా వినిపిస్తోంది. .