విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద ఇంత కాలం ఏపీ ప్రభుత్వ రాజగురువుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్లేట్ ఫిరాయిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి ఎన్ని మేళ్లు పొందినా ఆయన తరచూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా అప్పన్న చందనోత్సవ సమయంలో ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించకపోయినా.. ఆయన మాటలు ఇంత చేతకాని ప్రభుత్వమా అని విమర్శించినట్లుగా ఉన్నాయి. ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏం జరిగినా ఇంత కాలం జగన్ ను వెనకేసుకు రావడంలో ఆయన ఎప్పుడూ ముందు ఉండేవారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆయన వారసుడు స్మాత్యేంద్రనంద… తాము ఏ పార్టీకి అనుబంధం కాదని చెప్పుకొచ్చారు. అలా ప్రత్యేకంగా ఎందుకు చెప్పారో తెలియదు కానీ.. తర్వాత సీన్ మారిపోయింది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారన్న ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణంలో ఇద్దరూ హాజరు కాలేదు. తర్వాత కూడా వెళ్లలేదు.
ఇక ఇటీవల మైసూర్ నుంచి విజయ్ కుమార్ స్వామిజీని ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చి మరీ ఆశీర్వాదం ఇప్పించానని.. వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తన లాంటి స్వామిని ఎప్పుడూ పిలువలేదు కానీ.. విజయ్ కుమార్ స్వామిని పిలిపించి ఆశీర్వాదం తీసుకుంటారా అనే అసంతృప్తి శారదాపీఠం స్వామిలో ఉందని చెబుతున్నారు. క్రమంగా తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న సూచనలు కనిపించడంతోనే స్వరూపానంద ఫైర్ అయ్యారని అంటున్నారు.
అదే సమయంలో అప్పన్న చందనోత్సవం పూర్తిగా వీఐపీల కోసం అన్నట్లుగా సాగింది. భక్తుల్ని అసలు పట్టించుకోలేదు. వీఐపీలు అందరూ దర్శనం చేసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్వరూపానంద కూడా ఇలా వీఐపీ దర్శనం చేసుకున్నారు. భక్తుల నుంచి విమర్శలు వస్తాయన్న కారణంగా ఇలా రివర్స్‌లో ప్రభుత్వంపైనే నిందలేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.