జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారని వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరని గతంలో చెప్పారు. దానికి తగ్గట్లుగానే వారిద్దరి మధ్య కాస్త మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి .. పవన్ కల్యాణ్‌పై మండి పడుతున్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నారు. అయితే బాలినేని నేరుగా పవన్ కు సవాల్ చేసినా అసలు ఆరోపణలు చేసింది మాత్రం పవన్ కాదు.. విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్.
ఇటీవల ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ పై ఐటీ దాడులు జరిగాయి. ఇందులో వందల కోట్ల అనుమానాస్పద లావాదేవీలు బయటపడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచిఓ ఎమ్మెల్యే.. తెలంగాణ నుంచి మరో ఎమ్మెల్యే ఆ సంస్థలో బినామీ పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. ఆ ఏపీ ఎమ్మెల్యే బాలినేనిశ్రీనివాసరెడ్డేనని ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డితో కలిసి విశాఖలో దోచుకున్నదంతా కలిసి మైత్రీలో పెట్టుబడులు పెట్టారని .. మూర్తి యాదవ్ ఆరోపించారు ఈ ఆరోపణలు వైరల్ అయ్యాయి. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. తనపై జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. తాను ఒక్క రూపాయి కూడామైత్రీలో పెట్టుబడి పెట్టడం లేదంటున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఆయన గతంలో హవాలా మనీని తమిళనాడుకు తరలిస్తూ పట్టుబడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన మంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఆయనను సీఎం జగన్ కూడాదూరం పెడుతున్నారు. ప్రోటోకాల్ కూడా దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. ఈ సమయంలో ఆయనకు బినామీ పెట్టుబడులు అంటూ ఆరోపణలు రావడం ఇబ్బందికరమే. అందుకే ఘాటుగా స్పందించారని అనుకోవచ్చు