తెలంగాణ బీజేపీ బలపడటానికి కిందా మీదా పడుతోంది. బలపడిన మాట నిజమే కానీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత కాదని ఇప్పటికే ఓ క్లారిటీ అందరికీ వచ్చేసింది. అందుకే అమిత్ షా రంగంలోకి దిగారు. చేవెళ్ల సభలో ఆయన చాలా స్పష్టంగా బీజేపీ నేతలకు ఓ ఆయుధం ఇచ్చారు. అదే ముస్లిం రిజర్వేషన్ల రద్దు. ఈ వివాదాస్పద ప్రకటన చేసింది స్వయంగా కేంద్ర హోంమంత్రి. దీంతో తెలంగాణలో ఈ అంశంపై బర్నింగ్ ఇష్యూ అవుతుంది.
ముస్లింలకు ఇప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చెప్పడానికి ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారు కానీ.. అవి ముస్లింలలో ఆర్థికంగా బాగా వెనుకబడిన 14 ఉపకులాలకు చెందినవారికి ఉన్నాయి. వైఎస్ హయాంలో ముస్లింలను ఆకట్టుకోవడానికి వీటిని ఇచ్చి కులాల జాబితాలో ఆయా వర్గాలను చేర్చారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం చెల్లవు. అందుకే ఈ రిజర్వేషన్లు ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉన్నాయి. వీరికి ఉన్న రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు
ఆ తీర్మానం తర్వాత కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. మునుగోడు ఉపఎన్నికలకుముందు ఎస్సీ రిజర్వేషన్లపై అధికారం లేకపోయినా జీవవో ఇచ్చారు కానీ.. ముస్లిం రిజర్వేషన్లకు ఇవ్వలేదు. ఈ వివాదాల హైలెట్ అయ్యే అవకాశం ఉండటంతో ఎన్నికల అంశం చేసేందుకు అమిత్ షా రెడీ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దును ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకలో ఇలా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేశారు.కానీ సుప్రీంకోర్టులో అగిపోయింది. వారికి కావాల్సింది రాజకీయమే కాబట్టి. తెలంగాణలోనూ ఇదే హైలెట్ కానుంది.