2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తెలుగు పార్టీలు ముఖ్యంగా ఏపీ రాజకీయ పార్టీలు చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటికే బీజేపీతో కటీఫ్ చెప్పి యుద్ధం ప్రకటించిన టీడీపీ.. కర్ణాటకలో తెలుగు ఓటర్లను ప్రభావితం చేయడానికి వీలైనంత మందిని ప్రయోగించింది. అదే సమయంలో వైసీపీ నేతలు బీజేపీకి మద్దతుగా వెళ్లారు. ప్రచారం చేశారు. ఇలా రెండు పార్టీల మధ్య వార్ కర్ణాటకకు కూడా పాకింది.
కానీ ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో మాత్రం జోక్యం చేసుకోవడానికి చంద్రబాబు, జగన్ వెనుకడుగు వేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయినా ఒక్కరు కూడా ఆ రాష్ట్ర ఎన్నికల గురించి కనీస ప్రకటన చేయలేదు. నిజానికి కర్ణాటకలో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి స్థిరపడిన వారు కాకుండా తరతరాలుగా కర్ణాటక స్థిరపడిన తెలుగు మూలాలు ఉన్న వారు కూడా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వారి ఓట్లు గెలుపోటముల్ని నిర్దేశించబోతున్నాయి. అందుకే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు ఓటర్లపై పక్రత్యేక దృష్టి పెట్టాయి.
తెలుగు రాష్ట్రాట్రాల నుంచి నేతల్ని ప్రచారానికి పిలవడంతో పాటు సామాజికవర్గ సమీకరణాల్ని చూసుకుంటూ నేతల ప్రచార షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. మెజార్టీకి అవసరమైన ఓట్లు తెలుగు ఓటర్లు ఇస్తారని నమ్మడంతో ఈ సారి అన్ని పార్టీలు తెలుగు ఓటర్లుపై ఎక్కువ దృష్టి పెట్టాయి. బెంగళూరు నగరంతో పాటు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో దాదాపుగా 60 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటముల్ని నిర్దేశించే పరిస్థితిలో ఉన్నారు. తెలుగు ఓటర్లు అందరూ ఎటు వైపునిలబడితే అటు వైపు విజయం ఉంటుందన్న ప్రచారం అయితే సాగుతోంది. అయినా ఏపీ రాజకీయ నేతలు మాత్రం బీజేపీతో గెలుక్కోవడం ఎందుకని సైలెంట్ గా ఉంటున్నారు.