ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉందో చెప్పేందుకు ఇదే ఓ ఉదాహరణ. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేది అరకొర జీతాలు. పదిహేనేళ్ల నుంచి పని చేస్తున్నప్పటికీ వారి జీతాలు ఇరవై వేల లోపే ఉంటాయి. అలాంటి వారికి సమయానికి జీతాలు ఇవ్వడంలేదు. పైగా వారికి ఆయా ఔట్ సోర్సింగ్ సంస్థలు ఇచ్చే జీతాలను కూడా ప్రభుత్వం వాడేసుకుంది. ఇప్పుడిదే హాట్ టాపిక్.
ఆంధ్రప్రదేశ్ టూరిజం లో ఎక్కువ మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉంటారు. వారికి ఈ నెల జీతాలు ఇరవై మూడో తేదీ వరకూ రాలేదు. సాధారణంగా టూరిజం ఉద్యోగులకు జీతాల సమస్య రాదు. ప్రత్యేక కార్పొరేషన్ అది. ఆ సంస్థకు ప్రత్యేకంగా ఆదాయం ఉంటుంది. ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించుకుంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖల ఉద్యోగులతో ఓ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. జీతాలు ఆ కార్పొరేషన్ ద్వారా చెల్లిస్తున్నారు. ఈ జీతాలేమీ ప్రభుత్వం ఇవ్వదు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను ఆయా కార్పొరేషన్లు, సంస్థలు సమయానికి ఆ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఖాతాలో జమ చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలుగా వాటిని చెల్లిస్తుంది. ఇప్పుడు టూరిజం కార్పొరేషన్ నుంచి జీతాలు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ కు జమ అయ్యాయి. వాటిని ప్రభుత్వం వాడేసుకుంది కానీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం చెల్లించలేదు. దీంతో వారు నానా తంటాలు పడుతున్నారు. అసలే అతి తక్కువ జీతానికి పని చేస్తూంటారు. వారి జీతాలను సక్రమంగా ఇవ్వకపోవడం కాదు.. అసలు వారి జీతాల్ని కూడా ప్రభుత్వం వాడుకోవడం ఏమిటనేది అందర్నీ విస్మయపరుస్తున్న అంశం.
టూరిజంలో ఇప్పటికే పునరావసం కింద కొంత మంది రెడ్డి సామాజికవర్గం వారికి పదవులు ఇచ్చారు. వారు లక్షల్లో జీతాలు, ఖర్చులు బిల్లలు డ్రా చేసుకుంటున్నారన్న విమర్ళలు ఉన్నాయి. వరప్రసాద్ రెడ్డి అనే టూరిజం చైర్మన్ యాభై లక్షలు సంస్థ సొమ్ముతో కారు కొని.. సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఆయన విదేశీ పర్యటనల ఖర్చు కూడా టూరిజంపైనే వేస్తున్నారు. ఇలాంటివి లెక్కలేనట్లుగా దుబారాగా ఖర్చు చేస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం కనీసం జీతాలివ్వలేకపోతున్నారు.
ఏపీ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదన్న విషయం అనేక సార్లు బయటపడుతోంది. ఇప్పుడు .. ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్న సమయంలో.. తాము బాగుంటే చాలు.. అన్నట్లుగా వ్యవహరిస్తోంద. సలహాదారులకు .. మొదటి ప్రయారిటీగా జీతాలు చెల్లిస్తున్నారు కానీ..అతి తక్కువకు పని చేసే ఉద్యోగులు మాత్రం అల్లాండిపోతున్నారు