మైత్రీ మూవీస్ సంస్థపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా మైత్రీ ఆఫీసులపైనే కాదు, సుకుమార్ ఇంట్లోనూ, తన కార్యాలయంలోనూ ఐటీ రైడ్ జరిగింది. ఈ తనిఖీలతో ఐటీ శాఖకు కొన్ని కీలకమైన ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం. ముఖ్యంగా హీరోలకు ఇచ్చిన పారితోషికాలపై సమగ్రమైన సమాచారాన్ని రాబట్టిందని తెలుస్తోంది. సాధారణంగా హీరోలకు ఇచ్చే పారితోషికాలు బ్లాక్, వైట్లలో ఇస్తుంటారు. మొత్తం పారితోషికం వైట్లో చూపించరు. దాంతో హీరోలకు సైతం టాక్స్ కట్టే బాధ కొంచెం తగ్గుతుంది.
మైత్రీ మూవీస్ ఇప్పుడు పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తోంది. అగ్ర హీరోల పారితోషికం ఈరోజుల్లో 70- 80 కోట్లకు తగ్గడమే లేదు. ముఖ్యంగా ప్రభాస్ తో ఓ సినిమా ప్లాన్ చేసింది మైత్రీ మూవీస్. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ప్రభాస్ తో పాటు కొంతమంది కీలకమైన టెక్నీషియన్లకు మైత్రీ అడ్వాన్స్ ఇచ్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు ఐటీ చేతిలో ఉన్నాయి. ప్రభాస్ తో పాటుగా మైత్రీలో పని చేస్తున్న హీరోలందరికీ ఎంతెంత పారితోషికాలు ఇచ్చారు, అందులో వైట్ ఎంత? బ్లాక్ ఎంత? అనే విషయాలతో సహా.. అన్ని వివరాలూ ఐటీ రాబట్టింది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు హీరోలపై పడే ప్రమాదం ఉంది. హీరోలు సైతం తమ పారితోషికాన్ని తగ్గించి చూపించి, పన్ను ఎగ్గొడితే… ఇప్పుడు ఈ హీరోలు సైతం పెనాల్టీ కట్టాల్సివస్తుంది.