పులివెందుల మార్క్ రాజకీయాల్ని హైదరాబాద్‌లో చూపించాలని ఫిక్స్ అయ్యారేమో కానీ.. షర్మిల, విజయమ్మ ఇద్దరూ పోలీసులపై దాడి చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి వెళ్తారని ప్రచారం జరగడంతో షర్మిల ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. అయితే షర్మిల వారిని నెట్టేసుకుని ముందుకు వెళ్లారు. ఈ సందర్భంలో తన చేతిని పట్టుకుంటున్నారన్న కారణంగాఓ మహిళా కానిస్టేబుల్ చెంపపై గట్టిగా కొట్టారు షర్మిల. తర్వాత వెంటనే కారులో కూర్చుని ఉన్న ఎస్ఐ దగ్గరకు వెళ్లి ఆయనను బయటకు లాగి దాడి చేసింది. దీంతో పోలీసులు నిశ్చేష్ఠులయ్యారు.
వెంటనే ప ోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. షర్మిలను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకుని వైఎస్ విజయమ్మ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్ లోకి ఆమెను పోలీసులు అనుమతించలేదు. బలవంతంగా వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో విజయమ్మ కూడా మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేశారు. అటు షర్మిల, ఇటు విజయమ్మ పోలీసులపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
షర్మిల నేరుగా పోలీసులపై దాడి చేయడంతో నేరుగాజైలుకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా మంది రాజకీయ నేతలని పోలీసులు అడ్డుకుంటారు కానీ.. ఎవరూ పోలీసులపై దాడి చేసేంత ఆవేశపడలేదు. ఏపీలో ఇంకా దారుణంగా ప్రతిపక్ష నేతలపై దాడులకు పోలీసులు ప్రోత్సహిస్తూ ఉన్నా వారిపై టీడీపీ నేతలు దాడి చేసే ప్రయత్నం చేయలేదు. కానీ షర్మిల మాత్రం .. కారులో కూర్చున్న ఎస్ఐను బయటకు లాగి మరీ దాడి చేయడం సంచలనంగా మారింది.