వైసీపీ గజదొంగల పార్టీ అని వచ్చే ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండదని ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ఆవేశపడ్డారు. తాము వైసీపీపై పూర్తి స్థాయి కార్యాచరణను ఖరారు చేసుకుంటామని … ప్రజాపోరు ప్రారంభిస్తున్నామని కూడా ప్రకటించారు. ఇంకా ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలే చేస్తున్నారు. అయితే ఎన్ని మాటలు అన్నా… ప్రజల్లో మాత్రం ఈ మాటల వల్లనే బీజేపీ, వైసీపీ వేర్వేరు కాదు అనే భావన మాత్రం ఏర్పడదు. కళ్ల ఎదుట బీజేపీ, వైసీపీ సహకార ఫలాలు ప్రజలకు కనిపిస్తూండగా.. ఈ బయట కనిపించే డైలాగుల్ని మాత్రం ఎవరు నమ్ముతారు.
ఏపీ బీజేపీ నేతలు తాము వైసీపీకి సహకరించడం లేదని.. తాము వైసీపీకి దగ్గర కాదని.. నిరూపించుకోవడానికి ఇటీవల తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. ప్రజలు .. బీజేపీ, వైసీపీ ఒక్కటేనని అనుకోవడం వల్లే ఓట్లు వేయలేదన్నారు. తాము వైసీపీకి దగ్గర కాదని నిరూపించుకోవాల్సి ఉందన్నారు. అందు కోసమే ప్రత్యేకంగా పోరాటం చేస్తామని కూడా ప్రకటించారు. అయితే .. ఆయన అలా అన్నా … వైసీపీకి మాత్రం అందాల్సిన సహకారం అందుతూనే ఉంది.
కొత్తగా గుంటూరులో జరిగిన కార్యవర్గ సమావేశంలో తాము వైసీపీ ప్రభుత్వంపై చార్జిషీట్లు వేస్తామని ప్రకటించారు. ఈ చార్జిషీట్ల ఐడియా ఏడాదిన్నర కిందట అమిత్ షా తిరుపతిలో ఇచ్చారు. ఇప్పటి వరకూ ఎగ్జిక్యూట్ చేయలేదు. చేస్తాం. చేస్తాం అని చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు చేస్తామని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పోరాటమూ చేయడం లేదు. ప్రకటనలు చేయడాన్ని వైసీపీకి వ్యతిరేక పోరాటం అని ఎవరూ అనుకోరు. ఎందుకంటే బీజేపీయేతర ప్రభుతవాలు ఉన్న చోట వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని బీజేపీ చేసే రాజకీయం కళ్ల ముందే ఉంది.
ఆయా చోట్ల రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయో లేదో కానీ ఏపీలో మాత్రం కళ్ల ముందు జరుగుతున్నాయి. రాజధానిని సమర్థిస్తున్నారు కానీ అక్కడ ఇళ్ల స్థలాల పేరుతో ఊహించనంత భయంకరమైన కుట్ర చేస్తూంటే కళ్లు మూసుకున్నారు. ప్రతిపక్ష నేతలపై హత్యాయత్నాలు ప్రీ ప్లాన్డ్ గా జరుగతూంటే… కేంద్రం నుంచి స్పందన ఉండదు. ఇలా ఒక్కటే కాదు.. అన్నీ అంతే. ఎప్పుడైతే వైసీపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని అడ్డుకుంటారో అప్పుడే బీజేపీ, వైసీపీ ఒకటికాదని జనం నమ్మడం ప్రారంభిస్తారు. మాటల్లో చెబితే కాదు..!