పోలీసులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు గంటల్లోనే బెయిల్ లభించింది. ఒక్క రాత్రి ఆమె చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఉదయమే ఆమెను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ కూడా జైలుకు వెళ్లారు. అమె పరామర్శించి బయటకు వచ్చిన గంటలోనే బెయిల్ మంజూరు అయింది. అదే జైల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి తో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి ఇతర వివేకా నిందితులు ఉన్నారు. అసలు ఈ దాడి ఎపిసోడ్.. ఆమె అరెస్ట్.. కొన్ని గంటలు జైల్లో ఉన్న వెంటనే బెయిల్ రావడం చకచకా జరిగిపోయాయి.
పోలీసులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసి.. తన డ్రైవర్‌తో ఓ కానిస్టేబుల్ ను ఢీ కొట్టమని ఆదేశించి కాలికి గాయమయ్యేలా చేసినా పోలీసులు చాలా ఉదారంగా వ్యవహరించారు. మామూలుగా అయితే హత్యాయత్నం కేసు పెట్టి ఉండేవారు. కానీ అలాంటి కేసులు పెట్టలేదు. 332, 353, 509, 427 ఐపీసీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. బెయిల్ వచ్చే సెక్షన్లే కావడంతో నాంపల్లి కోర్టులో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాదించారు.
జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా పోలీసులపై దాడి చేశారు. అయితే పోలీసులు ఆమెపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఆమెపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని.. వైఎస్ఆర్టీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్ చూస్తూంటే.. వివేకా హత్య కేసులో జైల్లో ఉన్న వారిని నేరుగా ములాఖత్ ద్వారా కలవలేక.. ఇలా పోలీసులపై దాడి చేసి షర్మిల ఓ రోజు జైలుకు వెళ్లి… ఆమె పరామర్శ పేరుతో విజయమ్మ వెళ్లి.. చర్చించి వచ్చారన్న ఆరోపణలు టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో వారికే తెలియాలి కానీ.. షర్మిలలా ఇతరులు ఎవరైనా పోలీసులపై దాడి చేసుంటే మాత్రం… ఎలాంటి కఠిన చర్యలు తీసుకునేవారో ఊహించడం కష్టమని చెప్పవచ్చు.