విజయవాడలో నిన్న జరిగిన తెదేపా విస్తృత స్థాయి సమావేశాలలో పార్టీ నేతలని ఉద్దేశ్యించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2019 ఎన్నికలలో తెదేపా ఏకపక్షంగా గెలవాలనే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కానీ అది సాధ్యమేనా..అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అది అసంభవమేనని చెప్పవచ్చును.
ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు వంటి అనేక హామీలనన్నిటినీ పక్కన పడేసి ప్రధాని నరేంద్ర మోడి తమను వంచించారని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలే కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంపై అసంతృప్తిగా ఉన్నారు.
అలాగే పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ, సోము వీర్రాజు వంటి బీజేపీ నేతలు కూడా తెదేపా ప్రభుత్వంపై అసంతృప్తిగానే ఉన్నారు. విభజన కారణంగా ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని కనుక ఆర్ధిక సహాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు చాలా దూబరా ఖర్చులు చేస్తుండటంపై కేంద్రం కూడా చాలా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయం పురందేశ్వరి విమర్శలలో స్పష్టంగా చూడవచ్చును.
మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా, బీజేపీల మధ్య ఇటువంటి పరిస్థితి నెలకొని ఉన్నందున వచ్చే ఎన్నికలలో అవి రెండు కలిసి పోటీ చేస్తాయో లేదో తెలియదు. ఒకవేళ కలిసి పోటీ చేస్తే కేంద్రంపై రాష్ట్ర ప్రజలలో నెలకొన్న వ్యతిరేకత తెదేపాపై కూడా ప్రభావం చూపవచ్చును. ఒకవేళ అవి తెగతెంపులు చేసుకొంటే అప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, బలాబలాలు పూర్తిగా మారిపోతాయి కనుక తెదేపా ఏకపక్షంగా కాదు కనీసం సాధారణ మెజార్టీతో గెలవడానికి కూడా చాలా చెమటోడ్చవలసి రావచ్చును. ఈలోగా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ రాష్ట్రంలో కోలుకొంటే దాని నుండి కూడా తెదేపా పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది.
పంట రుణాల మాఫీ, రాజధాని, విమానాశ్రయాల కోసం భూసేకరణ, రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణ పనులలో జరుగుతున్న జాప్యం, తెదేపా నేతలలో అవినీతి, పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం వంటి కారణాల చేత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే అ విషయాన్నీ అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఒప్పుకోకుండా ప్రజలు తమ పక్కనే ఉన్నారని ఆత్మవంచన చేసుకోవడం మామూలే కనుక ప్రస్తుతం తెదేపా కూడా అలాగే సమర్ధించుకొంటోంది.
గత ఎన్నికలలో ప్రజలు తనపై చాలా నమ్మకంతోనే తెదేపాకు అధికారం కట్టబెట్టారని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నూటికి నూరు శాతం వాస్తవమే. ఆ సంగతి ఆయనకి గుర్తున్నప్పుడు రెండేళ్ళు పూర్తికావస్తున్నా ప్రభుత్వం ఇంకా నత్తనడకలు నడుస్తుండటం సరికాదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చును కానీ ఆ కారణాలు ప్రజలకు అనవసరం. రాష్ట్రంలో ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలని, రాజధాని, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఉన్నత విద్యా, వైద్య సంస్థల నిర్మాణాలు పూర్తి కావాలని ప్రజలు ఆశిస్తున్నారు. అవన్నీ ఆయన స్వయంగా ఇచ్చిన హామీలే తప్ప ప్రజలు కొత్తగా అడుగుతున్నవి కాదు. తెదేపా, బీజేపీలు కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఏ పార్టీ విఫలమయితే అందుకు ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో మూల్యం చెల్లించకతప్పదు.
కనుక వచ్చే ఎన్నికలలో ఏకపక్షంగా విజయం సాధించడం గురించి ఆలోచించే బదులు, ప్రజలకిచ్చిన హామీల గురించి ఆలోచించి వాటిలో ఇంకా పూర్తిచేయవలసిన పనులన్నిటినీ యుద్దప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఇప్పటి నుండే గట్టి ప్రయత్నాలు చేస్తే వచ్చే ఎన్నికలలో తెదేపా ఏకపక్షంగా గెలవలేకపోయినా కనీసం మళ్ళీ అధికారం నిలబెట్టుకొనే అవకాశం ఉంటుంది.