కర్నూలు న్యాయ రాజధాని పేరుతో అక్కడి ప్రజల సెంటిమెంట్లతో ఆడుతున్న ప్రభుత్వం .. చివరికి పూర్తి స్థాయిలో మోసం చేసింది. కనీసం హైకోర్టు బెంచ్ పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు. జగన్నాథ గట్టు మీద హైకోర్టు పెడతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ స్కాంలకు అయితే పాల్పడ్డారు. అక్కడ పెట్టాలనుకున్న.. పెట్టిన కార్యాలయాలేమీ లేవు. పేరుకు మొదట కర్నూలుకు తరలిస్తారు.. తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అమరావతిలో ఏర్పాటు చేస్తారు. కర్నూలులో ఏర్పాటు చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చి రాత్రికి రాత్రి అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ఎన్నో ఉన్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎపిఇఆర్సి ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మార్చారు. ఈ మేరకు విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికిన కర్నూల్లో పెట్టారన్నది కనీసం చెప్పలేదు. ఒక వేళ తాము రాజధాని అని చెబుతున్న విశాఖలో అయినా పెట్టారా అంటే లేదు.. అసలు ఏపీఈఆర్సీ కి కర్నూలుకు సంబంధం ఏమిటోకూడా స్పష్టత లేదు.
ఈ అంశంపై ఎవరో ఒకరు కోర్టుకు వెళతారు. కోర్టు తరలింపు నిలిపివేస్తుంది. ఒక వేళ ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని కర్నూలులోనే ఉన్నా ప్రజలకు ఉపయోగం ఏమిటో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. ఏపీఈఆర్సీ చైర్మన్ ఎప్పుడూ కార్యాలయం ఉండరు. ఓ పది మంది ఉద్యోగులు వస్తారేమో కానీ.. కర్నూలులో పెడితే వారూ వస్తారో .. వర్క్ ఫ్రం హైదరాబాద్ అంటారో చెప్పడం కష్టం. ఆ విషయం ప్రభుత్వానికీ తెలుసు. అయినా కర్నూలు ప్రజల్ని మాయ చేద్దామని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ప్రతీ సారి మోసపోతారా ?