ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేయాలంటే ఇక ముూడు లక్షలు డిపాజిట్ కట్టాల్సిందే. అంత మొత్తం ఉంటే.. తాము ఎందుకు మద్యం దుకాణాల్లో పని చేస్తామని నిరుద్యోగులు నిష్టూరమాడినా తప్పదు. “మద్యం షాపు ల్లో పనిచేసే ఉద్యోగులు రూ.3 లక్షలకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పూచీకత్తు ఇవ్వండి…’లేకపోతే ఉద్యోగం లేనట్లేనని ఏపీబీసీఎల్ నుంచి సూపర్వైజర్లు, సేల్స్మెన్లకు నోటీసులు ఇచ్చారు. పూచీకత్తు ఇస్తేనే జీతాలు ఇస్తామని.. తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరికలు కూడా వెళ్లాయి.
ఏపీలో 2,934 మద్యం షాపులు, మరో 800 వందల వరకు ఉన్న వాక్ ఇన్ స్టోర్స్ ఉన్నాయి. 14వేల మంది వరకు సూపర్వైజర్లు, సేల్స్మెన్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ ను అనుమతించడం లేదు. కేవలం నగదు వ్యవహారాలనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని షాపుల్లో తరుచూ ఏదో ఒక జిల్లాలో నగదును ఉద్యోగులు స్వాహా చేస్తున్నారని అందుకే ఉద్యోగులకు ఈ నిబంధన పెట్టామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మద్యం షాపుల్లో నగదు స్వాహాతో పాటు కొన్ని షాపుల్లో మద్యం మాయంపై కొంత కాలంగా ప్రభుత్వం సీరియస్గా ఉంది. అయితే ఇలా ఉద్యోగుల పొట్ట కొట్టే బదులు … నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే.. మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది కదా.. అంటే.. ప్రభుత్వం మాత్రం దానికి సిద్ధంగా లేదు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో రూ.3లక్షలకు పూచీకత్తు ఇవ్వమనడంపై మద్యం షాపుల్లో పని చేసే వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. నెలాఖరు నాటికి యాజమాన్యం పూచీకత్తు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే సమ్మె చేస్తామని ఉద్యోగనేతలంటున్నారు.