ఏపీ బీజేపీలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. తాజాగా హైకమాండ్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ ప్రభుత్వంపై పోరాడమని చాలా కాలంగా హైకమాండ్ ఆదేశిస్తోంది. అయితే ఇక్కడ నేతలు మాత్రం లాబీయింగ్‌కే పరిమితమవుతున్నారు. అందుకే ఇప్పుడు టీమ్‌ను మార్చేసింది. వైసీపీ ప్రభుత్వంపై చార్జిషీట్లు వేసే ప్రోగ్రాంకు పూర్తి స్థాయిలో ప్రో వైసీపీ టీమ్‌ను పక్కన పెట్టేసింది. ఐదు నెలల క్రితం… వైజాగ్‌లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని పార్టీ నేతలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడంతో… కమిటీ ఏర్పాటు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
అంశాల వారీ చార్జిషీట్లు రూపొందించేందుకు జాతీయ నాయకత్వం నలుగురు నేతలతో కమిటీ నియమించింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లతో కమిటి ఏర్పాటు చేసింది. మద్యం, ఇసుక, మట్టి, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మాస్, ఆర్డీఎస్ఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, సెంటు భూమి పథకంలో అక్రమాలు జరిగాయి. వైజాగ్‌లో భూ ఆక్రమణలు, రిషికొండలో చోటు చేసుకున్న అక్రమాలు… వంటి విషయాలపై బీజేపీ కమిటీ చార్జిషీట్లు రూపొందించనుంది.
ఏపీలో జరుగుతున్న అవినీతిపై చార్జిషీట్ లు దాఖలు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా అంశాలను ఖరారు చేసి… ప్రతి పోలీస్ స్టేషన్లో చార్జిషీట్లతో పిర్యాదు చేయాలని రాష్ట్ర నేతలకు ఆదేశించింది. నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సోము వీర్రాజు అండ్ కోను పక్కన పెట్టి నలుగురు యాంటీ వైసీపీ టీములోని నేతలకు బాధ్యతలు అప్పగించారు. చార్జిషట్ల కమిటీ మే 5వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది. కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలు చోట్ల స్వయంగా చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు.