తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభానికి సిద్ధమయింది. ఈనెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నరు. ఈ సెక్రటేరియట్ గురించి ప్రచారం ఓ రేంజ్ లో చేస్తున్నారు. అహా.. ఓహో అని పొడిగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ సామాన్యుల మనసుల్లో మాత్రం.. లక్షణంగా ఉన్న భవనాల్ని కూలగొట్టి .. పదిహేను వందలకోట్లు వెచ్చించి కట్టింది ఇదా అన్న నిట్టూర్పు వినిపిస్తోంది. ఎందుకంటే ఆ భవనం.. ఇంజినీరింగ్ కాలేజీ భవనాల్ని తలపిస్తోంది. తెలంగాణ భవన్ తరహాలోనే ఉంది. కొత్తగా ఏముందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మారుతున్న కాలానికి తగ్గట్లుగా అత్యాధునిక టెక్నాలజీ ఏమైనా ఉందమో వాటి గురించి చెబుతారేమోనని చాలా మంది చూస్తున్నారు. అది రాజుల భవనం అయినట్లుగా రాజులు కూర్చునే కుర్చీల్లాంటి వాటిని గొప్పగా ప్రచారం చేస్తున్నారు. ఈ భవనం గురించి అధికారికంగా చెబుతున్న గొప్పలు ఏమిటంటే ఏ ఫ్లోరుకి వెళ్లినా గాలి, వెలుతురు ధారాళంగా రావడం… చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ స్థలం పచ్చదనం కోసం ఎనిమిది ఎకరాల స్థలం.. భవనానికి నలువైపులా వెడల్పైన మెట్ల దారి .. భారీ లిఫ్టులు ఇలాంటి వాటినే గొప్పగా చెబుతున్నారు. కానీ పరిపాలనకు అవసరమైన ఆధునిక సాంకేతికత ఏమైనా తెచ్చిపెట్టారా అన్నది ఏమీ చెప్పడం లేదు.
పాత సెక్రటేరియట్ ఉంటే.. ఉమ్మడి రాష్ట్ర గుర్తులు ఉంటాయన్న ఉద్దేశంతో వాటిని కూల్చేసి.. ఈ సెక్రటేరియట్ ను నిర్మించారు. కొత్త సెక్రటేరియట్ కట్టాలని కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి సాకారం అయింది. అయితే … పాత కాలం డిజైన్ తో … కొత్తగా నిర్మించిన ఫీలింగ్.. ఆ భవనాన్ని చూస్తే.. ఇంజనీరింగ్ కాలేజీ ఏమో అన్న అనుమానం వచ్చేలా ఉంది. బయటకు చెప్పలేకపోయినా ఎంతో ఊహించుకున్న అనేక మంది ఇదా సెక్రటేరియట్ అనే ఫీలింగ్ కు వస్తున్నారు.