చంద్రబాబునాయుడు ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీల విషయంలో, వాటిని కార్యరూపంలో పెట్టడానికి వారు కోరినంత వ్యవధి కూడా ఇవ్వకుండా.. మళ్లీ విమర్శలకు దిగుతున్నారు. తాను మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి తీసుకువస్తున్నారంటూ అప్పుడే కత్తులు దూస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం అంటూ అప్పుడే ఒక కంక్లూజన్‌కు వచ్చేసినట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ దఫా ముద్రగడ పద్మనాభం ఇలాంటి విమర్శలు లంకించుకోవడంలో కాసింత తొందరపడుతున్నారేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే.. జనవరి 30న ఆయన గర్జన నిర్వహించారు. నానా గందరగోళం అయింది. తర్వాత దీక్షకు కూర్చున్నారు. నాలుగురోజుల దీక్ష ఫిబ్రవరి 9న ఉపసంహరణ జరిగింది. అంతవరకు అంతా బాగానే ఉంది. అప్పట్లో హామీ ఇచ్చిన ప్రకారం ఈ బడ్జెట్లో 500కోట్లు కాపు కమిషన్‌కు కేటాయిస్తారని, వచ్చే బడ్జెట్‌నుంచి ఏడాదికి వెయ్యికోట్లు ఇస్తారని అనుకున్నారు. అయితే.. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల జరగడానికి నాలుగురోజుల ముందే ముద్రగడ ధ్వజమెత్తడం ప్రారంభిస్తే ఎలా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బడ్జెట్లో కాపు కమిషన్‌కు 500 కోట్లు కేటాయించకపోతే అప్పుడు మోసం చేసినట్లుగా ఆయన ఆవేదన చెందడంలో అర్థముంది.
అలాగే బీసీ కమిషన్‌లో కొత్తగా చేపట్టవలసిన నియామకం ఇంకా జరగలేదని అంటున్నారు. హామీలు ఇచ్చి 20 రోజులే అయ్యాయి. సాంకేతికంగా ఈ నిర్ణయానికి సమయం అవసరం కాకపోవచ్చు. అయితే కాపు కమిషన్ ద్వారా రుణాలు ఇస్తున్నదంతా పచ్చ చొక్కాల వారికే అని ముద్రగడ విమర్శించడం మరీ రాజకీయ ప్రేరేపిత విమర్శలాగానే ఉన్నది. తాను ఏ రాజకీయ పార్టీకీ చెందిన వాడని కాదని ఆయన చెప్పుకోవచ్చు గానీ.. ఈ విమర్శలు మాత్రం అలాగే ఉన్నాయి. రుణాలు పొందుతున్న వారు కాపులు కాకుండా ఇతర కులాల వారు అయితే మాత్రమే ముద్రగడ పద్మనాభం బాధపడాలి. తనకు రాజకీయ పార్టీల వాసన లేనప్పుడు.. అవి వస్తున్నది పచ్చ చొక్కాలకా, జగన్ చొక్కాలకా అనే సంగతి ఆయన పట్టించుకోకూడదు.
దీక్ష విరమించి 20 రోజులు కాకముందే.. భవిష్య కార్యాచరణ నాలుగైదురోజుల్లో ప్రకటిస్తా అని ముద్రగడ అంటున్నారు. అయితే ఈసారి ప్రభుత్వానికి వ్యవధి ఇవ్వకుండానే.. ఆయన ఇలా రెచ్చిపోవడం వల్ల.. ఆయనమీద కాపుల్లో గౌరవం పలచబడే ప్రమాదం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వానికి బడ్జెట్ పూర్తయ్యే దాకా వ్యవధి ఇచ్చి.. అప్పటికీ అన్యాయం చేస్తున్నట్లుగా క్లారిటీ వస్తే మళ్లీ పోరు బాట పట్టినా అర్థముంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.