వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ – 1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు తీర్పును ప్రకటించింది. మే ఐదో తేదీలోపు లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. విచారణను అత్యంత ప్రభావితం చేసే వ్యక్తి గంగిరెడ్డి అని ఆయన బయట ఉండటం వల్ల సాక్షులు ముందుకు రావడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేక హత్యలో ప్రధాన పాత్ర పోషించింది గంగి రెడ్డేనని సీబీఐ తెలిపింది. ప్రధాన నిందితుడిగా ఉండి ఇతను బయట ఉండటంతో సాక్షులు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారన్నారని తెలిపింది. ఏపీ హై కోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామని పేర్కొంది. గంగి రెడ్డి బయట ఉండటం అంత మంచిది కాదని సీబీఐ తెలిపింది. హత్య చేయడమే కాదు, నేరం కప్పిపుచ్చేందుకు ఆధారాలు కూడా చేరిపేశారని తెలిపింది. వెంటనే గంగి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. సీబీఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైన కేసులో ఏపీ పోలీసులు మొదట్లో ఎర్ర గంగిరెడ్డిని ప్రధాన నిందితునిగా చేర్చారు. ఈ కేసులో ఏపీ పోలీసులు 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేశారు. ఆ వెంటనే ఎన్నికలు జరిగి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. పోలీసులు నిబంధనల ప్రకారం 90 రోజుల్లో అంటే జూన్ 28 లోగా చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలం కావడంతో పులివెందుల కోర్టు ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కేసు సీబీఐ చేతికి వెళ్లడం, వారి చార్జిషీట్ లో ఏ1గా ఎర్ర గంగిరెడ్డి పేరుండడం జరిగింది. అయితే బెయిలు మాత్రం రద్దు కాలేదు. ఒకసారి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చాక, మెరిట్స్ ఆధారంగా రద్దు కుదరదని ఏపీ హైకోర్టు చెప్పింది.
దీనిపై సుప్రీంను సీబీఐ ఆశ్రయించింది. తాజాగా ఒకసారి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చినా సరే.. తర్వాత మెరిట్స్ ను బట్టి రద్దు చేయకూడదని అనుకోవడం కరెక్టు కాదని, మెరిట్స్ పరిశీలించి బెయిల్ రద్దు చేయవచ్చునని సుప్రీం కోర్టు పేర్కొంది. కేసు తెలంగాణకు బదిలీ కావడంతో… తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చివరికి ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.