కొందరు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటారు. దాని కోసం అహర్నిశలు కష్టపడతారు. అయినా అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. కానీ ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నం. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా వుండలేక సోషల్ మీడియాలో చాలా మంది రీల్స్ చేశారు. సాక్షి కూడా చేసింది. ఆమె వీడియోలు స్నేహితుల సర్కిల్ లో బాగా పాపులర్ అయ్యాయి. అలా స్నేహితులు ప్రోత్సహించడంతో సినిమాలకి ఆడిషన్స్ ఇచ్చిందట. అయితే అదేదో సీరియస్ ఆడిషన్స్ కాదు. సరదా వెళ్లి అసలు ఎలా చేస్తున్నారని చూసి వచ్చేదట. ఈ క్రమంలో ఆమె వీడియో ఒకటి సురేందర్ రెడ్డి కంట్లో పడింది. వెంటనే పిలుపొచ్చింది. రావడమే కాదు ఏజెంట్ లో హీరోయిన్ అయిపొయింది.
తన జర్నీ గురించి చెబుతూ.. ”మాది ముంబైలోని థానే. స్కూల్, కాలేజ్ అక్కడే జరిగింది. లాక్ డౌన్ లో కొన్ని రీల్స్ చేశాను. అవి పాపులర్ అయ్యాయి. కొన్ని ఆడిషన్స్ కి వెళితే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ అంతగా నచ్చలేదు. ఏజెంట్ అవకాశం కూడా నేను ఊహించలేదు. అసలు మొదట నమ్మలేదు. కానీ నాకు తెలిసిన ఓ వ్యక్తి.. అది చాలా పెద్ద సంస్థ, నిజంగానే సినిమా తీస్తున్నారని చెబితే హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. వారికి నచ్చింది. అలా సినిమాల్లోకి వచ్చేశాను. నిజానికి నేను ఫిజియోథెరపిస్ట్ ని. ఇప్పుడు నటిగా మారిపోయాను. అంతా ఓ మ్యాజిక్ లా అయిపొయింది” అని చెప్పుకొచ్చింది సాక్షి.