” ఇప్పుడు అధికారం మాది.. తర్వాత మా పిల్లలది.. ఆ తర్వాత వారి పిల్లలది… ” ఇదీ భారతీయ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల పేరుతో రాచరికాలు అమలు చేస్తున్న వారికి ఉన్న ఓ రూల్. ఒక్క సారి అధికారం పొందిన పాలకులు దాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం సిద్ధపడటం లేదు. కుదిరితే తాము లేకపోతే తమ వారసులు అధికారంలో ఉండాలనుకుంటున్నారు. ఇది ఓ రకంగా ప్రజాస్వామ్యం నియంతృత్వం. అలా కుటుంబాలకు కుటుంబాలే అధికారాన్ని ఏలడం ఏ విధంగానూ ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి వారసత్వ రాజకీయాల .. అవలక్షణం ఒక్క భారత ప్రజాస్వామ్యానికే ఉంది. మరి ఇతర దేశాల్లో ఎందుకు లెదు ?. ఎందుకు లేదంటే అక్కడ అధికారానికి కూడా పరిమితి పెట్టారు. అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఏ ఎవరైనా రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడు కాగలరు. మూడో సారి పోటీకి కూడా అక్కడి రాజ్యాంగం అవకాశం కల్పించలేదు. ఎంత అధికార దాహం.. పవర్ ఫుల్ ప్రెసిడెంట్ అయినా ఆ నిబంధనను మార్చలేకపోయారు. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ప్రజాస్వామ్యం బలంగా ఉన్న దేశాల్లో ప్రజల నుంచే పాలకులు పుట్టుకు వస్తున్నారు కానీ.. కుటుంబాల నుంచి కాదు. కానీ మన దేశంలోనే ఈ పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏమిటి ? అధికారంపై అదుపు లేకపోవడమా ? అధికారం అంటే తమ సొంతం అని రాజకీయ నేతలు భావించడమా ? తాము మాత్రమే పరిపాలించాలని ఆధునిక నియంతలుగా పాలకులు మారిపోవడమా ?
అమెరికాలో నాలుగేళ్లే అధికారం – రెండు సార్లే అధ్యక్షుడిగా ఉండే చాన్స్ !
ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ అతి పెద్దది. పురోగమిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒక్క చైనా మినహా దాదాపుగా అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలే. అమెరికాలో బలమైన ప్రజాస్వామ్యం ఉంది. అక్కడి రాజ్యాంగం చాలా పవర్ ఫుల్. నిజానికి అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడు అంటే.. ప్రపంచం మొత్తానికి పవర్ ఫుల్. మన దేశంలో ఓ రాష్ట్రానికి ఓ సారి ముఖ్యమంత్రి అయితేనే వ్యవస్థలన్నీ కబ్జా చేసేసి .. పోలీసుల్ని సొంత రాజకీయాల కోసం వాడుకుని అధికారాన్ని నియంత స్థాయికి తీసుకెళ్తూంటారు. కానీ ప్రపంచం మొత్తం పవర్ ఫుల్ లాంటి అమెరికా అధ్యక్షుడు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే. దానికి కారణం అక్కడి రాజ్యాంగం ఆయన అధికార పరిమితులను చాలా స్పష్టంగా నిర్దేశించింది. అమెరికాలో ఎంత పవర్ ఫుల్ వ్యక్తి అయినా అధ్యక్షుడుగా రెండు సార్లు మాత్రమే ఎన్నిక అవుతారు. మూడో సారి ఎన్నిక అవడానికి కాదు కదా పోటీ చేయడానికి కూడా ఆయనకు అర్హత ఉండదు. అందుకే అమెరికాలో చరిత్రలో నిలిపోయిన ఎంతో మంది అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే అధ్యక్షులుగా పని చేశారు. మూడో సారి అలాంటి ప్రయత్నం చేయలేదు. రెండు సార్లు గెలిస్తే ఆయన రాజకీయ జీవితం అంతటితో అంతమైనపోయినట్లే. ఇక సలహాలు, ప్రసంగాలు, పుస్తకరచనలు లేదా సొంత వ్యాపారాలకు పరిమితం కావాల్సిందే. రెండో సారి గెలిచేందుకు పోటీ చేయడానికి మాత్రం చాన్స్ ఉంటుంది. పోటీ చేయడంపై మాత్రం పరిమితుల్లేవు. ఈ కారణంగానే అమెరికా రాజకీయాల్లో వారసత్వం అనే ప్రశ్నే రాలేదు. సీనియర్ బుష్ కొడుకు అమెరికా అధ్యక్షుడయ్యాడు.. కానీ ఆయన అర్హత బుష్ కుమారుడు కావడం కాదు. ఇక్కడే అమెరికా ప్రజాస్వామ్య గొప్పదనం కనిపిస్తుంది.
మన దేశంలో అధికారంపై పరిమితి లేదు – రిటైర్మెంట్ కూడాలేదు!
కర్ణాటక ఎన్నికల్లో షమనూర్ శివశంకరప్ప అనే 91 ఏళ్ల నేతకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఇప్పటికి ఆయన ఆరు సార్లు గెలిచారు. ఏడో సారి పోటీలో ఉన్నారు. పొరుగునే ఉన్న మరో నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడికి కూడా టిక్కెట్ ఇచ్చారు. అంటే దశాబ్దాలుగా వారు ప్రజాప్రతినిధులుగా ఆ ప్రాంత ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ఎమ్మెల్యేలు అయితే వారు లేకపోతే వారు కుటుంబసభ్యులేనా ? అన్న ప్రశ్న సహజంగా అలాంటి వారిని చూస్తే వస్తుంది. అయితే శివశంకరప్ప చాలా దిగువ స్థాయి ఉదాహరణ మాత్రమే. మనం ఎగువ స్థాయి నుంచి చెప్పుకోవాలంటే లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. దీనికి కారణం మన దేశంలో రాజకీయ నాయకులు తమకు ఎలాంటి అర్హతలు నిర్దేశించుకోలేదు. ఎలాంటి రిటైర్మెంట్లు ఖరారు చేసుకోలేదు. తమకు ఎన్నో ప్రివిలేజెస్ పెట్టుకున్నారు. ఫలితంగా రాజకీయ నేత అనే డిజిగ్నేషన్కు ఎలాంటి అర్హత .. పరిమితులు లేకుండా పోయాయి.
మూడో సారి ప్రధాని అయ్యేందుకు మోదీ తహ తహ !
అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ఒబామా రెండు సార్లు అధ్యక్షుడయ్యారు. ఆయన పదవి కాలం మొత్తం ఎనిమిదేళ్లు. ఇండియా లాంటి అతి పెద్ద దేశానికి ప్రధాని మోదీ రెండు సార్లు ప్రధాని అయ్యారు. ఇప్పటికి ఆయన పదవి కాలం తొమ్మిదేళ్లు పూర్తయింది. మరో ఏడాదిఉంది. మూడో సారి కూడా తానే ప్రధాని కావాలని ఆయన తహతహలాడుతున్నారు. ఇంత కాలం నేనున్నా కదా.. ఈ సారి కొత్త నేతకు చాన్సిద్దాం అని ఆయన అనుకోవడం లేదు. అదే అధికారం. మళ్లీ తానే ప్రధాని అని ఆయన చెప్పుకుంటున్నారు.. బీజేపీ ప్రచారం చేస్తోంది. కానీ ప్రతీ సారి ఆయనే ఎందుకు అంటే.. అమ్మో.. మోడీ లేకపోతే దేశం ఏమైపోతుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. మోడీ పుట్టక ముందు దేశం ఉంది.. ఆ తర్వాత కూడా ఉంటుదనే నిజాన్ని అంగీకరించరు. ఒక్క మోదీ విషయంలోనే కాదు.. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, చంద్రబాబునాయుడు, యడ్యూరప్ప, వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రాజ్ నాథ్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే తాము రాజకీయ అధికారాన్ని అప్పగించి.. తమ వారసులకు అధికార బ్యాటన్ అందించాలనుకుంటున్నారుకానీ.. అది నిజమైన ప్రజల చేతుల్లోకి వెళ్లేందుకు మాత్రం అంగీకరించడం లేదు.
అధికారాన్ని పరిమితం చేస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ
రాజకీయ నేతలు తాము లేకపోతే దేశం ఏమైపోతుందో అని తెగ బెంగ పెట్టుకుంటూ ఉంటారు. కానీ రాజ్యాంగాన్ని ఓ సారి చదివితే.. వ్యక్తుల మీద దేశం నడవదని.. వ్యవస్థల మీద నడుస్తుందని అర్థం అవుతుంది. ఆ వ్యవస్థలు నడిపే వారు పక్కాగా ఉంటే చాలు దేశం పురోగమిస్తుంది. మన దేశం జోలికి ఎవరూ రారు. కానీ అధికారం చేపడుతున్న వ్యక్తులు ఆ వ్యవస్థల్ని బలహీనం చేసి.. తాము బలంగా ఉన్నట్లుగా షో చేస్తున్నారు. తాము లేకపోతే దేశం ఏమైపోతుందనే భ్రమ కల్పిస్తున్నారు. నిజానికి అప్పట్లో నెహ్రూ అయినా .. ఇప్పుడు మోదీ అయినా రెండు సార్లే అధికారం చేపట్టి మూడో సారి మరో నేతలకు చాన్స్ ఇచ్చి ఉంటే.. దేశం వినూత్న ఆలోచనలకు వేదిక అయ్యేదనే విషయంలో ఎలాంటి దాపరికాలు పెట్టుకోవాల్సిన పని లేదు. అలాగే రాష్ట్రాల్లో కూడా. ప్రాంతీయ పార్టీల నేతలు .. తమ పార్టీల్లో మరో నేతను పై స్థాయి దాకా ఎదగనివ్వరు. తమ వారసుడికి మాత్రమే చాన్సిస్తారు. సామర్థ్యం లేకపోయినా బలవంతంగా అంటగడతారు. వేరే వారికి అవకాశాలు దక్కపోవడంతో వారే నాయకులుగా మారిపోతున్నారు. అఖిలేష్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, కవిత, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది ఉంటుంది. కొంత మంది నేతలు తమను ప్రూవ్ చేసుకుంటున్నారు. కొంత మందిని బలవంతంగా అంటగట్టేస్తున్నారు.
అవకాశాలు కల్పిస్తేనే యువనాయకత్వం వెలుగులోకి !
ఒకప్పుడు క్రికెట్లో సచిన్ స్టార్ ప్లేయర్. ఆయన ఉంటేనే అంతంత మాత్రం విజయాలు వచ్చేవి. ఇక సచిన్ లేకపోతే ఎలా అనుకునేవారు. కానీ సచిన్ తర్వాత ఆయన కంటే బలమైన ప్లేయర్లు వచ్చారు.. సెహ్వాగ్,గంభీర్, కోహ్లీ..సహా ఇప్పుడు అనేక మంది సచిన్ తరహా మ్యాచ్ విన్నర్లు వచ్చారు. ఇక్కడ అసలు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే… అవకాశాలు కల్పించడం. సచిన్ లేకపోతే ఎలా అని ఆయన గాయల పాలైనాటీమ్లో ఆడించారు కానీ.. కొత్త వారికి అవకాశాలు కల్పించడానికి అప్పట్లో సాహసించేవారు కాదు. అలా చేయడం వల్ల చాలా మంది తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కోల్పోయారు. నిజానికి సచిన్ లాంటి ప్రతిభ ఎవరికీ ఉండదా ఉంటే.. అంతకంటే మాస్టర్ బ్లాస్టర్లు ఉంటారు. అవకాశాలు రాక.. ప్రతిభ చూపించుకోలేక వెలుగులోకి రారంతే. రాజకీయాల్లోనూ అంతే. యువనాయకత్వానికి అవకాశాలు రావాలంటే… తాము లేకపోతే దేశం ఏమైపోయిద్దో అని బాధపడేవాళ్లు .. రియలైజ్ కావాలి. తమ కంటే పోటుగాళ్లు రాజకీయాల్లోకి వస్తారని.. తాము తప్పుకుంటే చాలనే సంగతిని గుర్తించాలి. కానీ అలాంటి ప్రయత్నం జరుగుతుందా అనేదే సందేహం.
రెండు సార్లు మాత్రమే ప్రజాప్రతినిధి అయ్యేలా రూల్ తెస్తే దేశానికి ఎంతో లాభం !
నయా నియంతల వల్ల దేశ ప్రజాస్వామ్యానికి వస్తున్న ముప్పును సులువుగానే గుర్తించవచ్చు . దీనికి పరిష్కారం.. రెండు సార్లు మాత్రమే ప్రజాప్రతినిధిగా ఉండేలా అధికారం పరిమితం చేయాలి. అప్పుడు మాత్రమే యువతకు అవకాశాలు వస్తాయి. కొత్త నీరు రాజకీయాల్లోకి వస్తుంది. లేకపోతే ఎన్ని సార్లైనా పోటీ చేయడం.. అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించుకునే అవకాశాలు ఉండటంతో వారు రాజకీయ అధికారం అంటే తమ కుటుంబ సొంతం అనుకునే పరిస్థితి తెస్తున్నారు. ఇప్పుడుఈ పరిస్థితిని మార్చాలంటే అధికారాన్నిపరిమితం చేయాల్సి ఉంటుంది.
కానీ చేయాల్సిందే రాజకీయ నేతలే..ఎందుకు చేస్తారు?
రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావాలంటే అదిరాజకీయ నేతల వల్లే అవుతుంది. వారే చట్టాలు మార్చాలి.. రాజ్యాంగాన్ని మార్చాలి. ఓ చిన్న అటెండర్ ఉద్యోగం కోసం కఠినమైన నిబంధనలు.. చట్టాలు చేసే వీరు.. రాజకీయ నేతలు..ప్రజాప్రతినిధులు అవ్వాలంటే ఎలాంటి అర్హతలు అవసరం లేదని అనుకుంటారు. అందుకే ఎలాంటి ఆంక్షలు పెట్టుకోలేదు. ఎన్ని సార్లైనా అధికారం అనుభవించవచ్చని రాసుకున్నారు. రిటైర్మెంట్ అనేదాన్నిపెట్టుకోలేదు. తమ తర్వాత తమ కుటుంబ వారసులకు అధికారాన్ని ఆస్తిగా రాసిస్తున్నారు కానీ.. దేశం కోసం ఆలోచించడం లేదు. రాజకీయ నేతలు తల్చుకోకపోతే ఈ పరిస్థితి మారదు. రాజకీయ నేతలు మారాలంటే.. ప్రజల్లో మార్పు రావాలి.. ఉద్యమం చేయాలి. అధికారం ఎవరికైనా రెండు సార్లకే పరిమితం చేయాలన్న ఉద్యమం తేవాలి. అయితే కులం, మతం , ప్రాంతం ఆధారంగా ప్రజల్ని ఎలా ట్యూన్ చేయాలో.. ఇప్పుడు రాజకీయ పార్టీలకు బాగాతెలుసు. అందుకే ఇలాంటివి ఊహించుకోవడానికి బాగుంటుంది కానీ నిజమవ్వాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో?