సీఎం జగన్ జనంలోకి వెళ్లే ధైర్యం చేయడం లేదు. ఆయన అసలు ఆ ఆలోచన పెట్టుకోవడం లేదు. పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి అడుగుకో హమీ ఇచ్చిన ఆయన.. జనంలోకి వెళ్తే ప్రజలు నిలదీస్తారని క్లారిటీ వచ్చింది. ఎన్ని పరదాలు .. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకున్నప్పటికీ జనం అసహనంతో ఉన్నారని నిలదీస్తారని ఆయన భయపడుతున్నారు. అందుకే జనంలోకి వెళ్లకుండా ప్రజాదర్భార్ లాంటివి ఏమీ పెట్టకుండా ఆయన ఓ కాల్ సెంటర్ పెడతామనుకున్నారు. దానికి జగనన్నకు చెప్పుకుందాం అని ప్రచారం చేసుకున్నారు. ఇదిగో ప్రారంభిస్తున్నాం అని తేదీ కూడా ఇచ్చేశారు. ఏప్రిల్ 13 నుంచి అన్నారు. ఏప్రిల్ 30 వస్తోంది. కానీ దాని గురించి మాట్లాడేవారు లేరు. వాయిదా వేశామని కానీ .. మరొకటి కానీ ప్రభుత్వం చెప్పడం లేదు.
జగనన్నకు చెప్పుకుందాం అనే కాల్ సెంటర్ కాన్సెప్ట్ ను బెంగాల్ నుంచి తీసుకు వచ్చారు. దీదీకో బోలో అని ఐ ప్యాక్ బెంగాల్ లో నిర్వహించిన కాల్ సెంటర్ తరహా వ్యవస్థ. సమస్యలు చెప్పుకుంటే… ప్రభుత్వం దృష్టిలో ఉందని మంచి చేస్తుందన్న నమ్మకంతో రిజిస్టర్ చేసుకున్న వారంతా ఓట్లు వేస్తారన్న లక్ష్యంతో అక్కడ ప్రారంభించారు. కానీ ఏపీలో … ప్రభుత్వం అనేక హామీల్ని ఇచ్చింది. వాటిని పరిష్కరిచమనే కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తారు. అవన్నీ నేరుగా సీఎం జగన్ ఇచ్చినవి. మళ్లీ ఓట్లు వేస్తే చేస్తామంటే నమ్మరు… అలాంటి సమస్యలు వెల్లువలా వస్తాయన్న కారణంగానే ప్రస్తుతం వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.
జగన్ కు ఇలా చెప్పుకోగానే అలా సమస్యలు పరిష్కారమయ్యాయని పెద్ద ఎత్తున పబ్లిసిటీకీ కూడా ఐ ప్యాక్ ప్లాన్ చేసింది. కానీ కవర్ చేసుకోలేనంత ఆగ్రహం ఉందని.. కాల్ సెంటర్ కు .. వచ్చే కాల్స్ మొత్తం వైసీపీ నేతల దురాగతాలు… జగన్ చేతకాని తనానికి పరాకాష్టగా నిలిచే ఉదంతాల గురించే ఉంటాయన్న భయంతో ఆపేసినట్లుగా చెబుతున్నారు. మళ్లీ పెడతారో లేదో కానీ సమస్యలు వినడానికి జగన్ భయపడుతున్నారని స్పష్టమవుతోంది.