అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా అన్నది సీబీఐ ఇష్టం. ఈ మేరకు దర్యాప్తు సంస్థలకు న్యాయపరంగా ఎలాంటి ఆటంకాలు లేవు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే జూన్ ఐదో తేదీకి వాయిదా వేసింది. విచారణ ప్రారంభమైన తర్వాత ఇప్పుడు వాదనలు పూర్తయినా ఆర్డర్ ఇవ్వలేమని.. విచారణ జరుపుతున్న న్యాయమూర్తి స్పష్టం చేశారు. అందుకే సీజే బెంచ్ ముందు మెన్షన్ చేసుకోవాలని సూచించారు. దీంతో అవినాష్ లాయర్లు హుటాహుటిన సీజే బెంచ్ ముందు మెన్షన్ చేశారు.
ఈ కేసు విషయంలో ఇప్పటికిప్పుడు చేయగలిగిదేమీ లేదని.. విచారణ చేపట్టడం కుదరదని సీజే స్పష్టం చేశారు. వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేసుకోవాలన్నారు. కనీసం రెండు వారాలు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ లాయర్లు .. సీజేని కోరారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విషయంలో కామెంట్లు చూసిన తర్వాత కూడా ఇలా ఎలా ఒత్తిడి చేస్తారని సీజే అవినాష్ లాయర్లను ప్రశ్నించారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. తర్వాత ఈ పిటిషన్ విచారణ జరుపుతున్న న్యాయమూర్తి విచారణను.. జూన్ ఐదో తేదీకి వాయిదా వేశారు. సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది . ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం జరగలేదు పైగా సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చని చెప్పినట్లయిందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సాంకేతికంగా న్యాయపరంగా అవినాష్ అరెస్టును అడ్డుకునే ఉత్తర్వులేమీ లేవు. అందుకే .. సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు..ఇక సీబీఐదే ఆలస్యం.