దేశంలో బీజేపీ తర్వాత అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధికారిక ఆస్తుల గురించి ప్రకటించారు. పార్టీ ఫండ్ రూ. 1250 కోట్లకు చేరిందని పార్టీ నేతలకు తెలిపారు. ఇందులో రూ. 767 కోట్ల రూపాయల క్యాష్ ను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దీని నుంచి నెలకు 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఆ డబ్బుతో పార్టీని నడపడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేయడం, ప్రచారం, మౌలిక వసతులకు ఖర్చుపెడుతున్నారు. పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి TV యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా చేపడతామని కేసీఆర్ ప్రకటించారు.
అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ కూడా నడుపుతామన్నారు కేసీఆర్. నిజానికి మనస్తే తెలంగాణ పత్రికతో పాటు టీ చానల్ కూడా బీఆర్ఎస్‌దే. అసలు టీ చానల్ ఆఫీసు.. బ్రాడ్ కాస్టింగ్ మొత్తం తెలంగాణ భవన్ నుంచే నడుస్తోంది. అయినా పార్టీ తరపున చానల్ పెడతానని కేసీఆర్ ఎందుకన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ అర్థం కాలేదు. ఇంత డబ్బులున్నాయి అని ఏమో కానీ.. పార్టీ ఆర్థిక వ్యవహారాల అధ్యక్షులే చూసుకుంటారని సభలో తీర్మానం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఖాతాలు తెరవడం, కోశాధికారి అధ్యక్షుడికి సహాయకుడిగా వ్యవహరించడం, పార్టీ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మీడియా వ్యవస్థలను ఏర్పాటు చేయడం.. తదితర ఆర్థిక వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షునికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల కేసీఆర్.. దేశంలో మోదీకి తనను లీడర్‌గా పెట్టుకుంటే అన్ని రాజకీయ పార్టీల ఖర్చూ తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపైఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ.. బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్‌గానే వేల కోట్ల ధనం ఉందని స్పష్టంగా చెప్పారు. నెలకు ఏడు కోట్లకుపైగా వడ్డీ వస్తుందని కూడా చెబుతున్నారు. దీంతోనే పార్టీని నడుపుతున్నామని.. క్లారిటీ ఇచ్చారు.